ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హైడ్రా తమ ఇల్లు కూల్చినప్పుడు పుస్తకాలు పోయాయని ఏడుస్తూ కేటీఆర్‌కు చెప్తున్న బాలిక
మంత్రులు చెరువుల్లో ఇళ్లు కట్టుకుంటే ఎందుకు కూల్చలేదు?
పెద్దపెద్ద బిల్డర్ల అక్రమ నిర్మాణాల జోలికి హైడ్రా వెళ్లదెందుకు?
పేదలకు కనీసం సమయం ఇవ్వకుండా కూలగొట్టుడేంది?
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అక్రమాలకు ప్రభుత్వమే అండగా ఉంది
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం
హైడ్రా కూల్చివేతలపై బాధితులతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతో మంది బాధితులుగా మారారు. ఈ రెండేళ్లలో రేవంత్‌రెడ్డి సర్కారు ఒక్క ఇటుక పెట్టలేదు.. ఒక్క కొత్త కట్టడం లేదు. రేవంత్‌రెడ్డి చేసింది ఏంటి అంటే.. కూలగొట్టడమే’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి రానుందని, అప్పుడు బాధితులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం హైడ్రా బాధితులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన.. హైడ్రా కూల్చివేతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘హైడ్రా అరాచకాలు: పెద్దలకు న్యాయం, పేదలకు అన్యాయం’పేరుతో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పాలనలో పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం లభిస్తోందని దుయ్యబట్టారు. చాంద్రాయణగుట్టలో స్కూళ్లు కూడా కూల్చివేసిన ప్రభుత్వం, గర్భిణులను పక్కకు తోసేసి, మూడేళ్ల చిన్నారులు భోజనం లేకుండా ఏడ్చేలా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఒక ఇంటì గృహప్రవేశం చేసి వారం రోజులు కాలేదు.. బుల్డోజర్ వచ్చి కూల్చేసింది. ఇది మానవత్వం లేని చర్య‘అని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా బాధితుల బాధ అందరికీ అర్థమవ్వాలని అన్నారు. గత రెండేళ్లలో రేవంత్ రెడ్డి చేసింది కేవలం కూల్చివేతలే‘అని విమర్శించారు.
వాళ్ల దగ్గరకు హైడ్రా వెళ్లగలదా?
ప్రభుత్వానికి అందరూ సమానమైతే అక్రమంగా ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న పెద్దవాళ్ల జోలికి ఎందుకు వెళ్లటంలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ‘పెద్దపెద్ద బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లలేదు? పేదలకు న్యాయం చేయాలనుకుంటే.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు ఎందుకు పెడుతున్నట్టు? పేదల ఇళ్లు కూలగొట్టలేదని హైడ్రా కమిషనర్ చెబుతున్నారు. పేపర్లు, కోర్టు తీర్పులు ఉన్నా కూడా.. ఆలస్యం చేస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని అంటున్నారు. ఇలా చేస్తే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? కోర్టులు ఎందుకు? ఎఫ్‌టీఎల్‌లో ఇళ్లు కడితే ఎవరినీ వదలం అని చెప్పి పెద్దలను వదిలేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టారు. మరో మంత్రి వివేక్ కూడా హిమాయత్ సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఇల్లు కట్టుకున్నారు. సున్నం చెరువులో ఇల్లు కట్టుకున్న పేదలది తప్పు.. దుర్గం చెరువులో కట్టిన తిరుపతిరెడ్డిది ఒప్పా? ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి చెరువు మధ్యలోనే ఇల్లు కట్టుకున్నారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెరువులోనే ఇల్లు కట్టుకున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి నోటీసులు ఇచ్చే దమ్ము హైడ్రా అధికారులకు ఉందా? శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. గాజులరామారంలో 11 ఎకరాల ఆక్రమణకు ప్రభుత్వమే అండగా ఉంది. పేదలను వెళ్లగొట్టి గాంధీకి మాత్రం అండగా నిలిచారు. మూసీ నదిలో అడ్డంగా కట్టిన బిల్డింగ్‌ను కూడా ఇప్పటివరకు ఆపలేదు. మంత్రులు, పెద్దపెద్ద నాయకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..పేదలపైకి బుల్డోజర్లు పంపుతుంది. అందుకే మేం హైడ్రాను వ్యతిరేకిస్తున్నాం’అని కేటీఆర్ స్పష్టంచేశారు.
రాహూల్ మాటలేమయ్యాయి?
‘బుల్డోజర్ నా శరీరంపై నుంచి వెళ్లాలని యూపీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. అదే బుల్డోజర్ తెలంగాణలో ఇళ్లను కూలగొడుతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? కొండాపూర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న కొందరికి ప్లాట్లు ఇచ్చారు. వారిని కూడా హైడ్రా వెళ్లగొట్టింది. ఆర్మీ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూలగొట్టడం తప్పు అని, తెలియక తప్పు జరిగితే సరిదిద్దాలని చెప్పారు. ఇప్పుడు ఎందుకు కూలగొడుతున్నారు?’అని కేటీఆర్ ప్రశ్నించారు.


