జూబ్లీహిల్స్‌లో ఓట్లకోసం మజ్లిస్ చెప్పినట్టు ఆడుతున్నారు
విలువైన ఆర్మీ భూములను ముస్లిం శ్మశాన వాటికలకు ఇచ్చారు
షేక్‌పేట ప్రచారంలో కిషన్‌రెడ్డి
గోల్కొండ: రాష్ట్రంలో మజ్లిస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గులామ్‌గా మారి జీహుజూర్ అంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్‌పేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.. పరువు కాపాడుకునేందుకు జూబ్లీహిల్స్‌లో విజయం సాధించడానికి మజ్లిస్ పార్టీకి గులామ్‌గా మారిందని ఆరోపించారు.
మజ్లిస్ పార్టీ అడిగినవాటినల్లా మంజూరు చేస్తూ మైనార్టీ ఓట్లను పొందడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తున్నారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని అద్దెకు తెచ్చుకొని ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మార్చారని ఎద్దేవా చేశారు. మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని హద్దులూ దాటి హడావుడిగా అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే అని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లకు లొంగి విలువైన ఆర్మీ స్థలాలను ముస్లిం స్మశానవాటికలకు కేటాయిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పథకాలకు నిధులు కేంద్రానివే..
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నిటికి కేంద్ర ప్రభుత్వ నిధులే అందుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ బియ్యానికి సైతం కేంద్ర ప్రభుత్వ నిధులే ఆధారమని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్లేనని తెలిపారు. రాష్ట్రంలో రైతంగానికి అందుతున్న ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
గత రెండేళ్ల రేవంత్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తనకు తాను సెక్యులర్ వాదిగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను వర్గాలుగా విభజించి పాలిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.


