రోడ్ షోలో మాట్లాడుతున్న కేటీఆర్
బోరబండ రోడ్ షోలో సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
కారు–బుల్డోజర్ పోటీలో బుల్డోజర్‌ను ఓడించాలని పిలుపు
సాక్షి, హైదరాబాద్: కారు–బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న పోటీలో పేదలపైకి బుల్డోజర్ రాకుండా ఉండాలంటే, హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కారు గుర్తునే గెలిపించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సోమవారం రాత్రి బోరబండలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన సీఎం కుర్చీ కాపాడుకునేందుకు మాత్రం రాహుల్‌గాందీకి, ఢిల్లీకి వందలు, వేల కోట్లు పంపే రేవంత్‌రెడ్డికి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మాత్రం పైసలుండవని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ అని మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి రెండేళ్ల కింద ఒక్క ఛాన్సిచ్చినందుకే కదా ఏ ఒక్క పథకమూ అమలు కాకుండాపోయిందని ఎద్దేవా చేశారు. 
ఒక్క ఛాన్సిచ్చినందుకే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారర్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఒక్క ఛాన్స్ అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయకుండా ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదని ధ్వజమెత్తారు. ఏ ఒక్క మాటా నిలబెట్టుకోలేదని, నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అట్టర్‌ఫ్లాప్ అనే పేరొచ్చిందని మండిపడ్డారు. 700 మంది రైతులు చనిపోయే దుస్థితి ఏర్పడిందని, కౌలురైతులు, రైతు కూలీలను కూడా మోసగించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి మరో ఛాన్సివ్వొద్దని పిలుపునిచ్చారు. హింస, అరాచకత్వంతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ రౌడీయిజానికి జూబ్లీహిల్స్ నుంచే చరమగీతం పాడాలన్నారు.  
గల్లాపట్టి అమలు చేయిస్తాం 
బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కాంగ్రెస్ గల్లా పట్టి సంక్షేమ పథకాలు అమలు చేయిస్తామని కేటీఆర్ హామీనిచ్చారు. తమను మోసగించినందుకు నిరుద్యోగులు పోటీచేస్తే వారిపై దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని లూటిఫికేషన్ చేయడం తప్ప నిరుద్యోగులకు నోటిఫికేషన్లు రాలేదన్నారు. మీఠా మాటలు చెప్పిన రాహుల్‌గాంధీ పత్తాలేడని విమర్శించారు. ‘ప్రజలు తలచుకుంటే హిట్లర్ వంటి వాళ్లేపోయారు. నువ్వెంత’అని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వం పైసలివ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్పారన్నారు. అందుకే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వంద కోట్లు కావాలని ప్రపంచబ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు.  
కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు 
కులాలు, మతాలకతీతంగా అందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్, రేవంత్ పాలనను పోలుస్తూ కొన్ని ఉర్దూ కవితలతో ప్రజల్లో ఉత్సాహం రేకెత్తించారు. పథకాలు అమలు చేయని తీరు, హైడ్రా బాధితుల కడగండ్లు టీవీల ద్వారా ప్రదర్శించి చూపారు. ‘రేపు మీ బోరబండకి బుల్డోజర్ రాకుండా ఉండాలంటే కారునే గెలిపించాలి. మీకు అండగా బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామ’ని అన్నారు.  పార్టీ మారలేదని టార్చర్ చేసి తమ ఇల్లు కూల్చారని ఆత్మహత్య చేసుకున్న బీఆర్‌ఎస్ నాయకుడు సర్దార్ భార్య యాస్మిన్ కేటీఆర్ దృష్టికి తెచ్చారు.   

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
