
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో ఇవాళ తీవ్ర గందరగోళం నెలకొంది. అటు కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి, ఇటు కేటీఆర్ ముఖ్యఅతిథిగా బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నాయి. దీంతో ఎటు వెళ్లాలో పాలుపోక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
‘‘అన్నా.. ఎటు పోదామే’’ అంటూ నగరంలోని బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయి నేతలు ఒకరితో ఒకరు ఫోన్లలో చర్చించుకుంటున్నారు. ఇవాళ.. ఒకే రోజు జాగృతి, బీఆర్ఎస్వీ కార్యక్రమాలు నిర్వహించడమే అందుకు కారణం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్‌లో జాగృతి తరఫన లీడర్ కార్యక్రమం జరగనుంది. ఈ మీటింగ్‌ను ఆసరాగా చేసుకుని జాగృతిని బలోపేతం చేయాలని.. గ్రామ స్థాయి దాకా కమిటీలు వేయాలని ఆమె నిర్ణయించారు కూడా. వాస్తవానికి ఈ మీటింగ్‌ను గత నెల 15వ తేదీనే కవిత ఫిక్స్ చేశారు. అయితే..
ఈలోపు బీఆర్‌ఎస్వీ తరఫున రాష్ట్ర సదస్సు నిర్వహణ ప్రకటన చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విద్యార్థుల స్థాయి నుంచే ఎండగట్టాలని ఆ పార్టీ నిర్ణయించిది. ఈ నెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తోంది కూడా. ఉదయం సెషన్‌ను మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సాయంత్రం కేటీఆర్ పాల్గొని ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు మీటింగ్‌లు పార్టీ కేడర్‌లో మాత్రం గందరగోళానికి తెరదీశాయి.
తెలంగాణ జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్‌కు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు, ప్రాంతాలు వేర్వేరు అయినప్పటికీ.. ఒకే తేదీన నిర్వహిస్తుండడం గులాబీ దండులో చర్చనీయాంశమైంది. ఇద్దరిలో ఎవరికి జై కొట్టాలా? అని చర్చించుకుంటున్నారు.