
అనంతపురం: ఏపీలోని ప్రజల సమస్యలను గాలి కొదిలేసిన కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్ కావడమే ఇందుకు ఉదాహరణ. ఇక చంద్రబాబు చేపడుతున్న సభలకు స్పందన పెద్దగా లేకపోవడంతో జన సమీకరణ కోసం సరికొత్త డ్రామాలకు తెరలేపారు. చంద్రబాబు సభలకు జనాన్ని రప్పించాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాల్ని ముడిపెడుతున్నారు. సంక్షేమ పథకాలకు, ముఖ్యమంత్రి సభలకు అసలు సంబంధం లేకపోయినా చంద్రబాబు చేపట్టే సభలకు సంక్షేమాన్ని జత చేశారు.
అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు అత్సుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సంక్షేమ పథకాలు తీసుకునేవారు సీఎం చంద్రబాబు సభలకు వస్తేనే ఆ పథకాలు వర్తిస్తాయంటూ చాటింపు వేయించి మరీ చెబుతున్నారు. ఇది కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం అచ్చం పల్లిలో చోటు చేసుకుంది. ఇది విన్న స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ‘చాటింపు’ ఇలా కూడా వేయోచ్చా అని నవ్వుకుంటున్నారు. చంద్రబాబు వస్తున్నారంటే ఏదో హడావుడి చేయాలనే పార్టీ నేతలకు వేరే మార్గం లేక దీన్ని ఎంచుకున్నట్లున్నారు. జన సమీకరణ చేయాలని పార్టీ పెద్దల ఆదేశాల నేపథ్యంలోనే స్థానిక నేతలు ఇలా చేస్తున్నారని ఊరూ-వాడా అనుకుంటున్నారు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు కావాలంటే సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొనాలని, లేకపోతే అవి రావని చాటింపు వేయించారు. వచ్చే దీపావళి నుంచి ఆడబిడ్డ నిధి ఇస్తారని,.. చంద్రబాబు సభలో పాల్గొన్న వారికి చేస్తామంటూ దండోరా వేశారు. ఈ చాటింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రేపు(బుధవారం, సెప్టెంబర్ 10వ తేదీ) అనంతపురంలో సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభను నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు హాజరు కానున్న నేపథ్యంలో చాటింపు వేయించి మరీ జనాల్ని భయపెడుతున్నారు.