రేవంత్‌.. నీళ్ల మీద నీచ రాజకీయాలు ఎందుకు?: కవిత | BRS MLC Kavitha Serious Comments On Revanth Reddy And Congress, More Details Inside | Sakshi
Sakshi News home page

రేవంత్‌.. నీళ్ల మీద నీచ రాజకీయాలు ఎందుకు?: కవిత

Jan 31 2025 1:52 PM | Updated on Jan 31 2025 3:06 PM

BRS MLC Kavitha Serious Comments On Revanth Reddy And Congress

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని కవిత డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచనలు చేశారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు-నిజాలు’పై నేడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నీటి రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..‘నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోంది. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ నిలబడింది. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలి. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి.

వైఎస్సార్‌ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ కొనసాగించారు. కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోంది. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలి. రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్‌లా పనిచేస్తున్నారు. కేసీఆర్ శత్రువు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఆంధ్ర కేడర్‌లో పనిచేసిన ఆదిత్యా నాథ్ దాస్‌ను బాధ్యతల నుంచి తొలగించాలి. కృష్ణ ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలి.

కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశాం. మిషన్ కాకతీయ ద్వారా నీటిని అందించడం జరిగింది. కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నాం. తెలంగాణ ఏర్పడే సమయానికి 68 లక్షల టన్నుల వరి పండితే.. 2022-23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం పండింది. గోదావరి, కృష్ణా జలాలను వినియోగంలోకి తెచ్చుకోడానికి కేసీఆర్ కష్టపడ్డారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ.  

కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదు’ అంటూ మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement