Sakshi News home page

ఇది కంచెల రాజ్యం

Published Thu, Feb 15 2024 4:12 AM

The BRS MLAs protested by sitting on the floor outside the Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సభలో మాట్లాడన్విరు.. అసెంబ్లీ బయట కూడా మాట్లాడన్వివరా అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. బుధవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం అసెంబ్లీలో వాకౌట్‌ చేసిన అనంతరం మీడియా పాయింట్‌లో మాట్లాడేందుకు వెళ్లే క్రమంలో అక్కడ ఉన్న అసెంబ్లీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రికత్త నెలకొంది.

ఆ ప్రాంతం భారీ ఎత్తున పోలీసులు, మార్షల్‌తో నిండిపోయింది. దీనిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  కేటీఆర్, హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీడియా పాయింట్‌లో మాట్లాడొద్దని ఏమైనా నిబంధనలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజ మెత్తారు. ఇదేనా ప్రజా పాలన అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతు అణచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర అని ఆరోపించారు.

 ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. కంచెల రాజ్యం.. పోలీసు రాజ్యం అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నినదించారు. మీడియా పాయింట్‌కు వెళ్లే దారి మధ్యలో నేలపై కూర్చొని నినాదాలు చేశారు. చివరిగా కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీకు చెప్పినా ఒక్కటే.. గోడకు చెప్పినా అక్కటే అంటూ’’ అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారు.

రేవంత్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి: కడియం, పల్లా, వేముల
అంతకుముందు అక్కడ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు.

కంచెలు తొలగిస్తామని చెప్పి ఇప్పుడు కంచెలెందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి బయట ఒకటి చెబుతున్నారని, అసెంబ్లీలో ఒకటి చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణ సభ్యుల హక్కు అనీ, అలాంటి ప్రాంతంలో నియంత్రణ ఎలా పెడతారని నిలదీశారు.

రాజగోపాల్‌రెడ్డి మాటలను రికార్డుల నుంచి తొలగించాలి
కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాష గా చెప్పుకుంటున్నాడని, తెలంగాణ భాషను సీఎం అవమానపరుస్తున్నారని విమర్శించారు.

రెండు నెలల్లో కాంగ్రెస్‌ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందని, అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదని, ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement