
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హస్తిన పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతలను కాపాడుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ఏటీఎంలా మారిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పంపిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. పీసీసీ పదవి కోసం రేవంత్ రూ.50 లక్షలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీటుకు రూట్ కుంభకోణం బయటపడింది. రేవంత్ రెడ్డి వైఖరితో దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోయింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి నిష్ఫక్షపాతంగా విచారణ చేయించాలి. రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో అర్థమవుతోంది. హస్తిన పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ బాసులకు రేవంత్ రెడ్డి వేల కోట్లు చందాలు ఇస్తున్నారు. లీడర్లు, కాంట్రాక్టర్లతో రేవంత్ దందాలు చేశారు. రేవంత్ జపాన్ పర్యటనపై మాకు అప్పుడే సందేహాలు వచ్చాయి. యంగ్ ఇండియా పేరుతో దందా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో భారీ వసూళ్లను పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి రేవంత్‌ను తప్పించాలి.
మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేస్తే ఇప్పటి వరకూ బీజేపీ నేతలు స్పందించలేదు. వాల్మీకి స్కాంపై నోరు మెదపరు. సివిల్ సప్లయ్ స్కాంపై ఎలాంటి చర్యలు లేవు. బీజేపీకి నిజాయితీ ఉంటే ఈ స్కాంలపై స్పందించాలి. తెలంగాణలో ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. గవర్నర్‌ని కలిసి సీఎం అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తాం. నెల రోజుల్లో చర్యలు తీసుకోకుంటే మా పార్టీ కార్యచరణ తీసుకుంటాం అని హెచ్చరించారు.
యడ్యూరప్పపై విమర్శలు వస్తే రిజైన్ చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయలేదా?. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని అందరికీ తెలుసు. డీకే శివకుమార్‌ను తొలగించాలని కర్ణాటకలో బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, తెలంగాణలో మాత్రం బీజేపీ నేతలకు ఏమైంది?. హెరాల్డ్ కేసుపై రేవంత్ ఎందుకు స్పందించలేదు?. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతలను కాపాడుతోంది. బీజేపీ నేతలకు దమ్ముంటే రేవంత్ వ్యవహారంపై వెంటనే స్పందించాలి’ అని డిమాండ్ చేశారు.