‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు వస్తారా?’ | BJLP Leader Maheshwar Reddy On KCR | Sakshi
Sakshi News home page

‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు వస్తారా?’

Apr 28 2025 4:06 PM | Updated on Apr 28 2025 4:22 PM

BJLP Leader Maheshwar Reddy On KCR

హైదరాబాద్:  తెలంగాణ విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ అని బీజేఎప్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడంలో దిట్టని, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలపై చర్చకు వస్తారా? అని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎల్కతుర్తి సభలో సెటైర్లు వేశారు మహేశ్వర్ రెడ్డి. కొండంత రాగం తీసి.. దిక్కుమాలని పాట పాడినట్లు ఉంది బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని ఎద్దేవా చేశారు.

‘తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని నిందించారు. బీబీ నగర్ లో ఎయిమ్స్ ఎవరిచ్చారు?, కేసీఆర్ పదేళ్లపాటు మావోయిస్టులను చర్చలకు ఎందుకు పిలవలేదు. అధికారం పోయాక మావోయిస్టులు గుర్తుకు వచ్చారా?,  మావోయిస్టులను వెనకేసుకురావడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. గతంలో చర్చలు జరిపినప్పుడు ఏమైంది?,  మావోయిస్టులకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు’ అని ధ్వజమెత్తారు.

కేసీఆర్ పగటి కలలు కంటున్నారు..
మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. బీఆర్ఎస్ మోడల్ అంటే విధ్వంస పాలన.. ఫెయీల్యూర్ పాలన.. కుటుంబ పాలన. కుటుంబ పాలనకు కాలం చెల్లింది. తెలంగాణకు అప్పుల ఊబిలోకి కేసీఆర్ నెట్టారు. కాళేశ్వరం కట్టి తెలంగాణ ప్రజల మీద భారం మోపారు.  మొసలీ కన్నీరు కార్చిన కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’ అని మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement