
తిరుపతి, సాక్షి: తిరుమల క్షేత్రంలో మరో ఘోర అపచారం జరిగిందని.. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవనానంద స్వామి(డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్) ఎక్కడ? అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ వ్యవహారంపై బుధవారం భూమన మీడియాతో మాట్లాడారు.
నిన్న పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ చేశారు. ఆ నీటిని భక్తులు పవిత్రంగా చూస్తారు.అలాంటి డ్యామ్‌లో టూరిజం పేరుతో బోటింగ్ చేయడం ఏంటి?. టూరిజం వేరు.. అధ్యాత్మికం వేరు. టీటీడీ పరిధిలోనే పాప వినాశనం డ్యామ్ ఉంది. బోటింగ్‌పై ఈవో, అడిషనల్ ఈవో సమాధానం చెప్పాలి అని భూమన డిమాండ్ చేశారు.
అటవీ శాఖ పవన్ కల్యాణ్ దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. ఆ శాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని పాపవినాశనంలో మంగళవారం బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుండగా.. ఈ ప్రాంతంలోనే పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉన్నాయి. ఈ క్రమంలో బోటింగ్ వ్యవహారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
