కేసీఆర్‌ మామకు మద్దతిద్దాం | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ మామకు మద్దతిద్దాం

Published Wed, Nov 15 2023 5:14 AM

Asaduddin Owaisi takes jibe at Revanth Reddy - Sakshi

వికారాబాద్‌: ఎట్టి పరిస్థితిల్లోనూ సంకీర్ణ సర్కారు రానివ్వం.. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ మామకు మద్దతిద్దాం.. ఆర్‌ఎస్‌ఎస్‌ అన్న రేవంత్‌రెడ్డిని ఇంట్లో కూర్చోబెడదామని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ పిలుపునిచ్చారు. మంగళవారం వికారాబాద్‌లోని చిగుళ్లపల్లి గ్రౌండ్‌లో జరిగిన ముస్లింల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాహుల్‌గాందీ, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్‌ మూలాలు ఆర్‌ఎస్‌ఎస్‌లోనే ఉన్నాయని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆదేశాలతోనే రేవంత్‌ ముందుగా టీడీపీలోకి ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారని ఆరోపించారు. అందుకే అతన్ని కొడంగల్‌ ఇంటికే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. 2004, 2009 ఎన్నికల్లో గోషామహల్‌లో తమ సపోర్టు వల్లే కాంగ్రెస్‌ గెలిచిందన్నారు.

అప్పట్లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డితో తమకున్న సత్సంబంధాల వల్లే సపోర్టు చేశామని ఓవైసీ తెలిపారు. బీజేపీకి లాభం జరగకూడదనేదే తమ ప్రధాన ఉద్దేశమనీ, తమ అంతిమ లక్ష్యం ఆర్‌ఎస్‌ఎస్‌ను నిలువరించడమేనని స్పష్టం చేశారు. గోషామహల్‌లో బీజేపీ గెలుపునకు దోహదం చేస్తోంది కాంగ్రెస్సేనని ఆరోపించారు. తాను బీజేపీ, కేసీఆర్‌ ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయానని కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టారు.

నాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మీరే జైలుకు పంపారని కాంగ్రెస్‌ నేతలనుద్దేశించి విమర్శించారు. వారి కోరిక మేరకే.. అప్పట్లో తాను జైలుకు వెళ్లి జగన్‌తో రాయబారం చేశానని, ఆయన మీతో కలిసేందుకు ఒప్పుకోలేదని వివరించారు. ఆ రోజు మీరు నాకెన్ని డబ్బులు ఇచ్చారని కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించారు. సిద్ధాంత పరంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. 

పాతబస్తీ ఏమైనా బండి జాగీరా 
తెలంగాణలో ఆర్‌ఎస్‌ఎస్‌ గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఓవైసీ ఆరోపించారు. అది ఎప్పటికీ జరగనివ్వమని స్పష్టం చేశారు. కర్ణాటకలో బుర్ఖా వేసుకుని పోటీ పరీక్షలకు హాజరుకావద్దని ఆర్డర్‌ ఇచ్చారని, అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉందా అని ఆయన ప్రశ్నించారు. మైనార్టీల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉందనీ, అందుకే ముస్లింలు కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ పాతబస్తీలో సర్జికల్‌ స్టైక్‌ చేయిస్తాం అంటాడు.. పాత బస్తీ ఏమైనా నీ జాగీరా? అని ప్రశ్నించారు. జిల్లాలోని నాలుగు స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ముస్లిం మైనార్టీలను కోరారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు అబ్దుల్‌ ఆది, హఫీజ్, మీర్‌మహేమూద్, రఫీ, తాహెర్‌అలీ, ఉస్మాన్, మోయిజ్, ఇబ్రహీ, షరీఫ్, అలీమొద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement