అనంతగిరి: ప్రజా సమస్యల పరిష్కారం.. సంక్షేమ పథకాల అమలే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ గౌలికార్ ఫంక్షన్ హాల్‌లో ప్రజా ప్రణాళికపై సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్‌లకు శిక్షణ, సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకే సామాజిక అంశాలు, ప్రజా సేవపై ఎక్కువ అవగాహన ఉంటుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలనే ఉద్దేశంతోనే కొత్త సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు రెండు కళ్లు అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా పని చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజారంజక పరిపాలన సాగుతోందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, సహకారం అవసరమన్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రజలకు అధికారులు జవాబుదారీగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహమెహ్ర, అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, జెడ్పీ సీఈవో సుధీర్, డీఆర్వో మంగీలాల్, ఆర్డీవో వాసుచంద్ర, డీపీవో జయసుధ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్లు గడ్డం అనన్య, పట్లోళ్ల నీరజ, రజిత తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని కొత్రెపల్లిలో రూ.3.36 కోట్లతో ఎలక్ట్రికల్ స్టోర్స్‌కు, జైదుపల్లిలో రూ.2.98 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్‌టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కొత్రెపల్లి కౌన్సిలర్ స్రవంతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు, వైస్ చైర్మన్ మల్లేశం, పార్టీ మండల అధ్యద్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్ మౌనిక, నాయకులు శివయ్య, కరుణాకర్‌రెడ్డి, తుల్జారాం, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ధారూరు: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని నాగ్‌సాన్‌పల్లిలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని, ధారూరు ఆర్టీసీ బస్టాండు ఆవరణలో సీసీ రోడ్డును ప్రారంభించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద సీసీ రోడ్డుకు, మురుగు కాల్వల నిర్వాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదికలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అప్పులు తీరుస్తూనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి, మరమ్మతులకు రూ.600 కోట్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతన్నాయన్నారు. మండలంలోని రుద్రారం – నాగసమందర్ గ్రామాల మధ్య కొత్త వంతెన నిర్మాణానికి రూ.27.50 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్, పార్టీ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, నాగ్‌సాన్‌పల్లి, ధారూరు సర్పంచులు రేఖ, ప్రమీలగౌడ్, తహసీల్దార్ సాజిదాబేగం, ఎంపీడీఓ నర్సింహులు, పీఆర్ డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను విజయవంతం చేద్దాం
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
కొత్త సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం


