1.15 కోట్ల కుటుంబాలకు బీమా | Database health cards for 4 crore people | Sakshi
Sakshi News home page

1.15 కోట్ల కుటుంబాలకు బీమా

Mar 13 2026 1:59 AM | Updated on Mar 13 2026 1:59 AM

Database health cards for 4 crore people

4 కోట్ల మంది ప్రజలకు డేటాబేస్‌ ఆరోగ్య కార్డులు 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన 

టిమ్స్, నిమ్స్‌ ఆసుపత్రుల్లో 10 వేల బెడ్‌లు 

వైద్య విధానంలో కొత్త పాలసీ తెస్తాం 

విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తాం 

ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్‌ ఆస్పత్రి ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌/మణికొండ: రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా కల్పించి, ఆరోగ్య భద్రత అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. గురువారం ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ లోని మెడికవర్‌ 25వ ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ‘విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రభుత్వం ఫోకస్‌ చేస్తోంది. సంపూర్ణమైన విద్య అందిస్తే 90 శాతం సమస్యలు పరిష్కారమవుతాయి. సంక్షేమ పథకాల అవసరం ఉండదు. 2006లో రాజీవ్‌ ఆరోగ్య శ్రీ వచ్చింది. 

20 ఏళ్లలో కోట్లాది మందికి వైద్య సేవలందించాం. ఈ డేటాను ఎనాలసిస్‌ చేస్తాం. ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయనేది స్పష్టమవుతుంది. దీనికి తగ్గట్లు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 4 కోట్ల మంది ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవడానికి డేటాబేస్‌ డిజిటల్‌ కార్డును సిద్ధం చేస్తాం. పైలెట్‌ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించాం. మెడికల్, ఫార్మా, డ్రగ్స్‌ హబ్‌గా హైదరాబాద్‌ మారింది’అని చెప్పారు. 

విద్యార్థులకు రవాణా సదుపాయం 
‘రా్రష్తంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 21 లక్షల మంది విద్యార్థులున్నారు. కేవలం పాఠశాలకు వెళ్లి చదువుకునే విధానం తల్లిదండ్రులకు సంతృప్తినివ్వడం లేదు. 3వ తరగతి చదువుతున్న విద్యార్థి 2వ తరగతి పాఠ్యపుస్తకాన్ని కేవలం 6.5 శాతం మంది మాత్రమే చదవగలుగుతున్నట్లు మా సర్వేలో తేలింది. విద్యతోపాటు స్కిల్‌ అవసరం. స్కిల్‌ లేకుంటే ప్రపంచంతో పోటీపడలేం. నర్సరీ నుంచి 12 వరకు తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ అనే కొత్త కాన్సెప్ట్‌ తెస్తున్నాం. 

ఎడ్యుకేషనల్‌ రిఫారŠమ్స్‌ తీసుకురావడమే కాకుండా ఇప్పటివరకు ఉన్న ఇంటర్మీడియెట్‌ విధానాన్ని వచ్చే ఏడాది నుంచి రద్దు చేస్తాం. నర్సరీ నుంచి 12 వరకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కిందకు తెస్తాం. వివిధ పాఠశాలలను ఒక దగ్గరకు తెస్తాం. ప్రైవేటు స్కూల్స్‌ సక్సెస్‌ స్టోరీ.. రవాణానే. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఉచితంగా, లేదా 50 శాతం రాయితీతో ప్రభుత్వమే విద్యార్థులను పాఠశాలకు తరలిస్తుంది. మేము ఐటీఐలను అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)గా మార్చాం. 

సీఎస్సార్‌ కింద పదేళ్ల పాటు టాటాసన్స్‌ సంస్థ వీటిని నిర్వహిస్తుంది. రూ.2,400 కోట్ల బడ్జెట్‌లో 2,100 కోట్లు టాటాసన్స్‌ భరిస్తుంది. భవిష్యత్తులో పాలిటెక్నిక్‌ కళాశాలలనూ ఈ కోవలోకి తెస్తాం. ప్లేట్‌లో ఆహారం వడ్డిస్తే అది ఎన్ని కేలరీలు ఉంటుందో తెలిపే యాప్‌ ఉంది. దాన్ని వాడుకుంటాం’అని రేవంత్‌రెడ్డి చెప్పారు.

బ్లూ కలర్‌ జాబ్స్‌కు సిద్ధం కండి
‘వైట్‌ కాలర్‌ జాబ్‌లో వచ్చే గ్యాప్‌ను భర్తీ చేయడానికి బ్లూ కలర్‌ జాబ్‌కు ప్రిపేర్‌ కావాలి. దీన్ని ఏఐ రీప్లేస్‌ చేయలేదు. మొదటి దశలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌ తీసుకున్నాం. రెండో దశలో సేవారంగం తీసుకున్నాం. ఇప్పుడు తయారీ రంగంపై దృష్టిసారిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి హెల్త్‌ టూరిజంలో తెలంగాణకు 8–10 లక్షల మంది, ఇతర దేశాల నుంచి 2.10 లక్షల మంది వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని నెలల్లో రూ.1,800 కోట్లు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేశాం. 

10 వేల బెడ్‌ ఆసుపత్రులుగా ఎల్‌బీనగర్, సనత్‌నగర్, అల్వాల్, వరంగల్‌ టిమ్స్, నిమ్స్‌ ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌ చేయబోతున్నాం. ముఖ్యమంత్రిగా అడుగుతున్నా ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు సంవత్సరంలో ఒక నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయండి. మిగతా 11 నెలలు మీరు పనిచేస్తున్న సంస్థలు, కుటుంబం కోసం పనిచేయండి. దీనికి ఒక ప్లాట్‌ఫాం క్రియేట్‌ చేస్తున్నాం. 

వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. త్వరలోనే కొత్త పాలసీతో మీ ముందుకొస్తాం’అని రేవంత్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్‌యాదవ్, రఘువీర్‌రెడ్డి, సీపీ సజ్జనార్, మెడికవర్‌ ఆసుపత్రి చైర్మన్‌ అనిల్‌కృష్ణ తదితరులు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement