ఆయన పేరు పవన్‌ కల్యాణే కాదు: మంత్రి అంబటి | Sakshi
Sakshi News home page

ఆయన పేరు పవన్‌ కల్యాణే కాదు: మంత్రి అంబటి

Published Thu, Feb 29 2024 5:29 PM

Ambati Rambabu Slams On Pawan Kalyan - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: తాడేపల్లిగూడెం సభతో అసలు ఏం సందేశం ఇచ్చారని.. జెండా సభకు జనాలు రాకపోవటంతో ఆలస్యంగా మొదలుపెట్టారని ప్రతిపక్ష కూటమిని  ఉద్దేశించి ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం రాజమహేంద్రవరంలో మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

.. టీడీపీ జనసేన పొత్తు అట్టర్‌ఫ్లాప్‌. తాడేపల్లిగూడెం సభలో ఏం సందేశం ఇచ్చారు?. పవన్‌ షేరింగ్‌ గురించి మాట్లాడతారేమోనని అంతా ఎదురుచూశారు. పవర్‌ స్టార్‌ అన్నారుకానీ.. పవర్‌షేరింగ్‌ గురించి మాట్లాడలేదు. సీఎం జగన్‌ను దూషించడం కోసమే జెండా సభ జరిగినట్లుంది. జనసైనికులు చెవిలో పూలు పెట్టుకొని వచ్చారని చంద్రబాబు భావించినట్టున్నారు.

పవన్‌ కల్యాణ్‌ అంటే నాకు గౌరవం ఉంది. ఆయన మంచి నటుడు. కానీ, రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదు. పవన్‌ ఇప్పుడు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. పి​చ్చి, పిచ్చి సినిమా డైలాగులు కొడుతున్నారు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానన్న పవన్‌.. ఇప్పుడు తనను ప్రశ్నించొద్దంటున్నాడు. పవన్‌ ఎవరిని బెదిరిస్తున్నాడు?. పవన్‌ చీప్‌ బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తున్నాడు. పవన్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే. పవన్‌ను నమ్ముకున్న అమాయకుల పరిస్థితి ఏంటి?. పవన్‌కు అసలు పార్టీ నడపడం రాదు. 

.. చంద్రబాబుని జైల్లో పెడితే బాధేసిందని పవన్‌ విలపించారు. మరి వంగవీటి రంగను హత్య చేసినప్పుడు పవన్‌కు బాధ కలగలేదా?.. ముద్రగడను వేధించినప్పుడు బాధ కలగలేదా? అని అంబటి ప్రశ్నించారు. కాపు సోదరులంతా పవన్‌ గురించి ఆలోచించుకోవాలి.

పవన్‌ కల్యాణ్‌ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్‌. సీఎం జగన్‌ను తొక్కేస్తానంటూ పిచ్చి మాటలు మాట్లాడాడు. లేకుంటే తన పేరు పవన్‌ కల్యాణే కాదని అన్నాడు. అవును.. ఆయన పేరు పవన్‌ కల్యాణ్‌ కాదు. జగన్‌ను అధఃపాతాళానికి తొక్కాలంటే.. పవన్‌ను పుట్టించిన వాళ్లు రావాలి.  ఏది అనుకున్నాడో దాని గురించి నిలబడే నాయకుడు వైఎస్‌ జగన్‌. అలాంటిది సీఎం జగన్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదు. జనసైనికులను అడిగితే పవన్‌ గొప్పో.. జగన్‌ గొప్పో చెబుతారు. 

రాజకీయాల్లో 1+1=0. రెండు పార్టీలు కలిసి సభ నిర్వహిస్తే ఎలా ఉండాలి?. పవన్‌తో పొత్తు ఎందుకు పెట్టుకున్నానని చంద్రబాబే ఇప్పుడు అనుకుంటున్నాడు. మీ పొత్తు ఎలాంటిదో తాడేపల్లిగూడెం సభతోనే తేలిపోయింది. రాజకీయాల్లో పవన్‌ ఆటలో అరటి పండులాంటి వాడు అని మంత్రి అంబటి తేల్చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement