
హైదరాబాద్: ‘వచ్చే 10 ఏళ్లు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారు’ అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో అలజడి సృష్టించాయి. అవకాశం దొరికినప్పుడల్లా వచ్చేసారి కూడా తానే ముఖ్యమంత్రినని రేవంత్ చెప్పుకుంటూ ఉన్నారు. దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉండగా, తాజాగా రాజగోపాల్ రెడ్డి బయటపడ్డారు.
ప్రధానంగా రేవంత్ మళ్లీ తానే ముఖ్యమంత్రినని ఎలా చెప్పుకుంటారని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ స్పందించారు. రేవంత్ 10 నుంచి 15 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలనేది కొల్లాపూర్ ప్రజలు కోరుకున్నారని, రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటే తమ జిల్లా పెండింగ్ పనులు అవుతాయని సభకు వచ్చిన ప్రజలు కోరుకున్న నేపథ్యంలోనే అలా వ్యాఖ్యానించారని సంపత్ కుమార్ చెప్పుకొచ్చారు.
జనం చెప్పిన దాన్నే సీఎం సభలో చెప్పారని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి సంగతి అధిష్టానం చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను… pic.twitter.com/nGtGpQzgGk— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 19, 2025
కేటీఆర్ మాటలు శ్రుతిమించుతున్నాయి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చురకలంటిచారు సంపత్ కుమార్. కేటీఆర్ మాటలు శ్రుతిమించుతున్నాయని, ప్రస్తుతానికి కేటీఆర్ పుస్తకంలో ఒక పేజీ మాత్రమే చదివామని, ఇంకా చాలా కథ ఉందంటూ సెటైర్లు వేశారు. ‘కేటీఆర్ నీకంటే ఎక్కువ బాష మాట్లాడగలను... తట్టుకోలేవు. లోకేష్‌ను కలవలేదంటవ్...కలిస్తే తప్పేంటి అని నువ్వే అంటవ్...రేవంత్ రెడ్డి మొనగాడు. మొగాడు కాబట్టే మిమ్మల్ని మట్టి కరిపించాడు.సీఎంను ఉద్దేశించి మాట్లాడే పద్దతి నేర్చుకో కేటీఆర్’ అని సూచించారు.