‘ఒక్కమాట మీకు నచ్చలేదని ప్రొ.నాగేశ్వర్‌ను వేధిస్తారా?’ | Actor Prakash Raj Reacts On Professor K Nageshwar Controversy | Sakshi
Sakshi News home page

‘ఒక్కమాట మీకు నచ్చలేదని ప్రొ.నాగేశ్వర్‌ను వేధిస్తారా?’

May 24 2026 7:12 AM | Updated on May 24 2026 11:12 AM

Actor Prakash Raj Reacts On Professor K Nageshwar Controversy

సాక్షి, అమరావతి: రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌పై జనసేన నాయకులు కేసులు పెట్టడాన్ని సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’లో వీడియో విడుదల చేశారు. ‘ఆయన మాట్లాడిన మొత్తం అంశాలను పక్కన పెట్టి, అందులో ఒక లైను మాత్రమే పట్టుకొని సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌లు, కేసులు, బెదిరింపులు... ఏమిటివన్నీ. ఇది ప్రజాస్వామ్యమా. లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం అనే రాజకీయ గూండాయిజమా?

..మీకు నిజంగా ఒక్క మాట తప్పు అనిపిస్తే దానికి ఆధారం అడగండి. రాజకీయంగా కౌంటర్‌ ఇవ్వండి. కానీ సోషల్‌ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం.. ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి’ అంటూ తూర్పారపట్టారు. ‘ఓ రాజకీయ విశ్లేషకుడిగా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వాళ్లను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను ప్రశ్నిస్తూనే వస్తున్నారు. చంద్రబాబును ప్రశ్నించారు, పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించారు. కేసీఆర్‌ను ప్రశ్నించారు, జగన్‌ను ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పటి ఆయన నిజాయితీ కూడా మీకు గుర్తుకు రాలేదు.

..ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయనపై యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా ? ప్రశ్నించే గొంతులను కేసులతో మూసేయాలని చూడడం ప్రమాదకరం. ఈ రోజు నాగేశ్వర్, రేపు ఇంకెవరో...’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందో... ఎవరి పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. ఇలాంటి అర్థం లేని కార్యక్రమాలు దయచేసి వెంటనే ఆపండి’ అంటూ జనసేన నేతలకు  సూచించారు. ‘నాగేశ్వర్‌.. మీకు అండగా మేం ఉన్నాం. కీప్‌ అప్‌ ది గుడ్‌ వర్క్‌’ అంటూ మద్దతు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement