పెద్దపల్లి: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు ఏర్పాట్లు, వివిధ శాఖల వారీగా రూపొందించాల్సిన ప్రతిపాదనలపై అదనపు కలెక్టర్లు శ్రీరాములు, అరుణశ్రీతో కలిసి కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుధ్యం నిర్వహణ, మరుగుదొడ్ల ఏర్పాటు, విద్యుత్ దీపాలు, రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యాలు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ఆర్డీవో గంగయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


