పెద్దపల్లిరూరల్: ‘అన్నా.. ఎక్కడున్నవే. తమ్మీ నేను గీ కమాన్ కాడ ఉన్న. ఇక్కడకు రా’ అని జిల్లాలోని పలు మండలాలు, పల్లెలకు చెందిన ప్రజల మదిలో నిలిచిన కమాన్ కాలగర్భంలో కలిసిపోయింది. పెద్దపల్లి ఐకానిక్‌గా దాదాపు దశాబ్దంపాటు నిలిచిన చారిత్రక కమాన్ కట్టడం కనుమరుగైంది. నిజాం నవాబుల కాలంలో అప్పటి ఆర్థికమంత్రి కప్పం వసూళ్ల కోసం పెద్దపల్లికి వచ్చినప్పుడు ఇక్కడి జాగీర్దార్ స్వాగతం పలికేందుకు ‘కమాన్’ నిర్మించారు. అదే సమయంలో ఆయన ఇక్కడ సేద తీరేందుకు నిర్మించిన విశ్రాంతి గృహమే ఇప్పుడు ధర్మారం రోడ్డులో కనిపించే పురాతన ‘దేవిడి’ భవనం అని చరిత్ర చెబుతోంది.
ఆనాటి అవసరాలకు అనుగుణంగా..
ఆనాటి అవసరాలకు అనుగుణంగా నిర్మించిన కమాన్(స్వాగత తోరణం) ప్రస్తుతం జిల్లా కేంద్రంగా మారిన పెద్దపల్లిలో పెరిగిన జనాభా, వాహనాల రద్దీకి అనువుగాలేదు. తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండడంతో శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో ‘మున్సిపాలకులు’ కమాన్‌ను తొలగించి ఆధునిక హంగులతో కొత్తగా కట్టడం నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు బుధవారం రాత్రి ఐకాన్‌ను కూల్చివేశారు.
ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం
జిల్లా కేంద్రంగా మారిన తర్వాత పెద్దపల్లి రోజురోజుకూ విస్తరిస్తోంది. దీనికి వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన వారు, పొరుగు జిల్లాలైన మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగించాల్సి రావడంతో కమాన్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. కమాన్ పరిసరాల్లోనే జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏఎస్సై భాగ్య, ఓ ఏఎన్‌ఎం.. ఇలా పలువురు మృత్యువాత పడ్డారు. ట్రాఫిక్ ఇబ్బందులకు ముగింపు పలికేందుకు ఇరుకుగా మారిన కమాన్‌ను తొలగించి.. కొంచెం అటు, ఇటుగా కొత్త కమాన్ నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయం తీసుకుని అమలు చేశారు.
ముగిసిన శతాబ్దపు పెద్దపల్లి చరిత్ర
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికే కూల్చివేత అంటున్న అధికారులు
త్వరలోనే ఆధునిక హంగులతో నిర్మిస్తామంటున్న పాలకవర్గం


