ధర్మారం/జూలపల్లి: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ధర్మారం మండలం చామనపల్లిలో చేపట్టిన సోషల్ ఎకానమీ సర్వే, సాయంపేటతోపాటు జూలపల్లి మండలం కాచాపూర్‌లో భూముల రీసర్వేను గురువారం పరిశీలించారు. జూలపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. సోషల్ ఎకానమీ సర్వేను పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు. చామనపల్లి ముంపు గ్రామ తరలింపు ప్రక్రియను మూడు నెలల్లో పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జూలపల్లి, ధర్మారం తహసీల్దార్లు ప్రసాదరావు, శ్రీనివాస్, సర్పంచులు వేల్పుల రేవతి, కూస శ్రీవాణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ శివ తదితరులు పాల్గొన్నారు.
రైతులు సహకరించాలి
ఓదెల: భూరీసర్వేకు రైతులు సహకరించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య కోరారు. కొమిర, ఇందుర్తిలో చేపట్టిన భూ రీసర్వేను గురువారం పరిశీలించారు. రీ సర్వేతో రైతుల భూ సమస్యలు తొలగిపోతాయని ఆర్డీవో తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ మహ్మద్ షఫీ, ఆర్‌ఐలు స్వరూప, చంద్రశేఖర్, జీపీవోలు సదయ్య, మహేశ్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లేవి?
మంథని: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ను గురువారం సందర్శించిన మధూకర్.. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్ కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడి కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కాంటాలు ఏర్పాటు చేసి వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటున్నారని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన వెంట నాయకులు ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్, మాచిడి రాజూగౌడ్, వేల్పుల గట్టయ్య, జంజర్ల శేఖర్, కొత్త బాలయ్య, ఆసీఫ్, ఇర్ఫాన్, గొబ్బూరి వంశీ తదితరులు ఉన్నారు.
అంతర పంటలు వేయాలి
పెద్దపల్లిరూరల్: ఆయిల్‌పాంలో అంతర పంట గా కూరగాయలు పండించాలని జిల్లా ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్ సూచించారు. హన్మంతునిపేటలోని ఆయిల్‌పాం చేనులో అంతర పంటగా వేసిన కూరగాయల తోటలను విస్తీర్ణాధికారి రాముతో కలిసి గురువారం పరిశీలించారు. తనకున్న నాలుగున్నర ఎకరాల్లో ఆయిల్‌పాం పంట వేశానని, డ్రిప్, మల్చింగ్ షీట్లతో అంతర పంటగా టమాట, మిర్చి సాగు చేస్తున్నానని రైతు గౌరవెల్లి రవీందర్‌రావు తెలిపారు. తక్కువ నీటివినియోగం, తక్కువ కాలపరిమితి గల బెండ, అలసంద, గోరుచిక్కుడు వంటి పంటలనే సాగు చేయాలని శ్యాంప్రసాద్ కోరారు. డిమాండ్ ఉన్న టమాట, మిరప, బీర, కాకర లాంటి పంటలను మల్చింగ్ షీట్ల సాయంతో సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వాటికి ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు.
క్వింటాల్ పత్తి రూ.8,778
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,778గా, కనిష్టంగా రూ. 8,456గా, సగటు రూ.8,644గా ధర ఉందని మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. గురువారం 490 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.


