వెలుగుల హారం ఎన్టీపీసీ | - | Sakshi
Sakshi News home page

వెలుగుల హారం ఎన్టీపీసీ

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

వెలుగుల హారం ఎన్టీపీసీ ● 52వ వసంతంలోకి ప్రాజెక్టు ● రేపు ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు ● విద్యుత్‌ ఉత్పత్తిలో విప్లవాత్మక అడుగులు

జ్యోతినగర్‌: భారతావనికి వెలుగులు అందిస్తున్న నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్టీపీసీ) ఈనెల 7వ తేదీతో 51 వసంతాలు పూర్తిచేసుకుని 52వ వసంతంలోకి అడుగిడుతోంది. రేపు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనుంది. స్వాతంత్య్రానంతరం తీవ్ర విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు కేంద్రం పరిధిలో ఒక విద్యుత్‌ కేంద్రం ఉండాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్‌ కేంద్రం ఉన్న రాష్ట్రానికి ఎక్కువ శాతం కేటాయించి, మిగిలిన విద్యుత్‌ను ప్రాంతాల వారీగా పంపిణీ చేయాలని తీర్మానించింది. వెంటనే కేంద్రప్రభుత్వం నిర్మించడం కష్టమని ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన బదర్‌పూర్‌ థర్మల్‌ కేంద్రాన్ని టేకోవర్‌ చేసింది.

తొలుత జాతీయ థర్మల్‌ కేంద్రంగా..

1975 నవంబర్‌ 7న రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో నమోదై జాతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంగా ఎన్టీపీసీగా గుర్తింపు పొందింది. బొగ్గు గనులు, గ్యాస్‌, నీరు, స్థలం అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్టులు నెలకొల్పుతూ దినదినాభివృద్ధి చెందుతూ అతిపెద్ద విద్యుత్‌ సంస్థగా ఎదిగింది. ప్లాంట్‌ సామర్థ్యం, పీఎల్‌ఎఫ్‌, మెయింటెనెన్స్‌, రక్షణ, విద్యుత్‌ పొదుపు, పర్యావరణ సమతుల్యం, మేనేజ్‌మెంట్‌లో ముందు స్థానంలో నిలిచింది. నవరత్న కంపెనీగా ఉన్న ఎన్టీపీసీ 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం చెందింది.

సొంత బొగ్గు.. గ్యాస్‌..

ప్రస్తుతం సొంత బొగ్గు, గ్యాస్‌, హైడ్రో, సోలార్‌, ఫ్లోటింగ్‌ సోలార్‌, ఎనర్జీ స్టోరేజీ, జాయింట్‌ వెంచర్లతో కలిపి 119 విద్యుత్‌ కేంద్రాల ద్వారా 91,667.69 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ ఎన్టీపీసీ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇది మొత్తం జాతీయ సామర్థ్యంలో 17.0 శాతం. సంస్థలో 16,779 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

2032 నాటికి 150 గిగావాట్ల లక్ష్యం

2032 నాటికి 150 గిగావాట్ల లక్ష్యంతో ఎన్టీపీసీ సూపర్‌ క్రిటికల్‌ మెగా ప్రాజెక్టులు నెలకొల్పుతోంది. అప్పటికీ శిలాజ ఇంధన ఆధారిత సామర్థ్యం పోర్ట్‌ఫోలియోలో దాదాపు 24 శాతం ఉంటుంది. ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలు, అమ్మకాలు, సొంత బొగ్గు గనులు, కన్సల్టెన్సీ, పవర్‌ ట్రేడింగ్‌, నిపుణుల శిక్షణ, బొగ్గు తవ్వకాల్లోకి విస్తరించింది. జాయింట్‌ వెంచర్లతో బంగ్లాదేశ్‌, భూటాన్‌, శ్రీలంకల్లో ప్రాజెక్టులు నిర్మిస్తోంది. భవిష్యత్‌ అణు విద్యుత్‌లోనూ ఎన్టీపీసీకే తొలి అవకాశం దక్కుతుంది. ‘పీపుల్‌ బిఫోర్‌ ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌’ మంత్రంతో ముందుకు సాగుతున్న ఎన్టీపీసీ.. 2024–25లో టాప్‌ ఎంప్లాయర్‌ –2025 సర్టిఫికేషన్‌ పొందింది. ఫోర్బ్స్‌ వరల్డ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌ 2024లోనూ గుర్తింపు పొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement