ప్లాన్ ఒకటి.. నిర్మాణం మరోటి
సెట్‌బ్యాక్ లేకుండానే కట్టడాలు
ఇరుకు సందుల్లోనూ భారీభవంతులు
నాలాలు కబ్జా చేస్తూ భారీగా కట్టడాలు
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
పట్టించుకోని టౌన్‌ప్లానింగ్ అధికారులు
ప్రధాన సమస్యలు ఇవే..
సాక్షి,పెద్దపల్లి: జిల్లాలోని బల్దియాల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నిబంధనలను పక్కనపెట్టి సందుల్లోనూ బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ప్లాన్‌కు విరుద్ధంగా అదనపు అంతస్తులు, పెంట్‌హౌస్‌లు కట్టడం, సెట్‌బ్యాక్ వదలకపోవడం, పార్కింగ్ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించడం వంటి ఉల్లంఘనలు బహిరంగంగానే కనిపిస్తున్నాయి. కొందరు నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలూ ఉన్నాయి.
సందుల్లో భారీభవంతులు
కాలనీలు, ప్రధాన రహదారులను ఆనుకుని నిబంధనలకు విరుద్ధంగా భవనాలు వెలుస్తున్నాయి. రెండు, మూడు అడుగుల మేర దారి ఉన్న ఇరుకు సందుల్లోనూ బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వీటిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు కనిపించడం లేదు. ఉల్లంఘనులపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో రోడ్డు విస్తరణ, అగ్నిప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు, అత్యవసర సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ ఎక్కడ?
మున్సిపల్ అనుమతి, భవన ని ర్మాణ నిబంధనలు, సెట్‌బ్యా క్, పార్కింగ్, నా లాల పరిరక్షణ వంటి అంశాలపై అధికారు లు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేక అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇదే విషయమై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీని వివరణ కోరగా.. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పని ఆమె హెచ్చరించారు.
వసూళ్లే లక్ష్యంగా..
భవన నిర్మాణ అనుమతి దరఖాస్తుల్లో క్షేత్రస్థాయి పరిశీలన కంటే ‘కలెక్షన్ల’పైనే అధికారుల దృష్టి కేంద్రీకతమైందనే ఆరోపణలున్నాయి. భవనం స్థాయిని బట్టి సిబ్బందికి భారీగా ముట్టజెబితేనే ఆన్‌లైన్‌లో ప్లాన్ ఆమోదం పొందుతున్నట్లు తెలుస్తోంది. లేనిపక్షంలో నిబంధనల పేరుతో నెలల తరబడి ఫైళ్లు పెండింగ్‌లో పెడుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. అధికారుల ఉదాసీనతతోనే భవిష్యత్‌లో నగరవాసులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది.
సెట్‌బ్యాక్ గాలికి: ఇరుకు సందులు, రెండు, మూడు అడుగుల దారుల్లోనూ సెట్‌బ్యాక్ వదలకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు.
అదనపు అంతస్తులు: అనుమతించిన ప్లాన్ కంటే అదనంగా అంతస్తులు, పెంట్‌హౌస్‌లు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
నాలాల ఆక్రమణలు: ప్రధాన రహదారుల పక్కన నాలాలను కబ్జా చేస్తూ అక్రమ కట్టడాలు చేపడుతుండటంతో ఏటా వర్షాకాలంలో రోడ్లు జలమయమవుతున్నాయి.
పార్కింగ్ మాయం: సెల్లార్ పార్కింగ్ కోసం కేటాయించాల్సిన స్థలాలను సైతం కొందరు యజమానులు కమర్షియల్ అవసరాలు, అద్దెల కోసం వాడుకుంటున్నారు.


