మంథనిరూరల్: గ్రామాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం మరో కార్యక్రమంతో ముందుకు వస్తోంది. రాబోయే మూడేళ్లలో చేపట్టాల్సిన వసతు లు, సామాజిక భద్రత, సుపరిపాలనతో కూడిన పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు పలు శాఖల అధికారులు జి ల్లాలోని ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ సమగ్ర వివరాలు సేకరించి విలేజ్ ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలోని ప్రతీ గ్రామపంచాయతీలో..
జిల్లాలోని గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి వివరాల సేకరణ మొదలైంది. పంచాయతీ కార్యదర్శి నుంచి మొదలు ప్రతీశాఖ నుంచి ఒక అధికారి పల్లెల్లో పర్యటించి వివరాలు నమోదు చేస్తున్నారు. వచ్చే మూడేళ్లలో అవసరమయ్యే వసతులు, అభివృద్ధి పనుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
పంచాయతీ పేరు మొదలుకుని..
విలేజ్ ప్రొఫైల్ నమోదులో సుమారు వందకుపైగా అంశాలపై వివరాలు సేకరించి నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో పంచాయతీ పేరు మొదలుకుని ఊరు విస్తీర్ణం, వార్డులు, రేషన్‌కార్డులు, నివాసాలు, కుటుంబాలు, కులాల వారీగా జనాభా, ఆలయాలు, స్కూళ్లు, రోడ్లు, మహిళా సంఘాలు, రైతులు, అక్షరాస్యత రేటు, కావాల్సిన అభివృద్ధి.. ఇలా అనేక వివరాలను సేకరించాల్సి ఉంటుంది. ఈ నివేదికల ఆధారంగానే పల్లెల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
మరుగుదొడ్లు.. సీసీ రోడ్లకు ప్రాధాన్యం
స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రతీ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో మరుగుదొడ్లు, సీసీ రోడ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతీగ్రామంలో సీసీరోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అపరిశుభ్రత నెలకొనకుండా కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు అనువైన స్థలాలను గుర్తిస్తూ నమోదు చేస్తున్నారు. సీసీరోడ్లు, అంతర్గత రోడ్లు, లింక్‌రోడ్ల వివరాలను సైతం నమోదు చేస్తున్నారు. అలాగే తాగునీటి సరఫరా వివరాలను సేకరిస్తున్న అధికారులు.. సమస్య తీవ్రతను తెలుసుకుని అక్కడ ఉన్న పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
వివరాలు నమోదు చేస్తున్నాం
ప్రతీ గ్రామపంచాయతీలో వచ్చే మూడేళ్ల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఇందుకోసం వివరాల సేకరణ పకడ్బందీగా జరుగుతోంది. పంచాయతీ కార్యదర్శితోపాటు వివిధ శాఖల అధికారులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. ప్రతీఅంశాన్ని పరిగణనలోకి తీసుకుని పక్కాగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించాం.
– శ్రీజారెడ్డి, ఎంపీడీవో, మంథని


