కోవిడ్ లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రులకు బాధితులు కిట్లు లేవంటూ తిప్పి పంపుతున్న వైద్యసిబ్బంది ప్రైవేటు డయాగ్నోస్టిక్‌లకు పరుగులు ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఏపీలో కోవిడ్ విజృంభణ, తెలంగాణలో సిద్ధంకాని ప్రభుత్వాసుపత్రులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీలో ఈ వైరస్ బారిన పడి పలువురు మృతి చెందుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం ఇంకా సంసిద్ధంగా లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. గతవారం ఒకే రోజు 12 మందికిపైగా బాధితులు ప్రాణాలు కోల్పోవడం వైరస్ తీవ్రతకు అద్ధం పడుతోంది. నిత్యం ఏపీ నుంచి తెలంగాణతో పాటు ఉమ్మడి కరీంనగర్ లక్షలాది మంది ప్రయాణాలు సాగిస్తారు. ఈ క్రమంలోనే పలువురు తెలంగాణవాసులకూ కోవిడ్ సోకుతోంది. లక్షణాలతో పరీక్షలు చేయించుకుందామనుకుని ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే ఆర్టీపీసీఆర్ కిట్లు లేవని తిప్పి పంపుతున్నారు. ర్యాపిడ్ యాంటిజన్ కిట్లు కూడా లేకపోవడం గమనార్హం. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు.. వరంగల్ ఎంజీఎంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.
వెలుగు చూసిందిలా
జూలై చివరివారంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నుంచి పలువురు స్నేహితుల బృందం విజయవాడ వెళ్లారు. తిరిగొచ్చాక బృందంలో కరీంనగర్‌కు చెందిన ఒక వ్యక్తికి కోవిడ్ లక్షణాలు కనిపించాయి. ప్రభుత్వాసుపత్రికి వెళ్తే పరీక్షలు జరిపేందుకు ఆర్టీపీసీఆర్‌తోపాటు ర్యాపిడ్ యాంటిజన్ కిట్లు లేవని సిబ్బంది చెప్పడంతో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకు పరుగులు తీయాల్సి వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో చివరికి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. తీరా అక్కడ కోవిడ్ పాజిటివ్‌గా తేల్చారు. ఆ బృందంలోని ఇతర జిల్లాలకు చెందిన వారూ ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే కిట్లు లేవని తిప్పిపంపారు.
గతంలో ఎలా ఉండేది?
కోవిడ్–19 ప్రారంభంలో ర్యాపిడ్ యాంటిజన్ కిట్లతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. తర్వాత ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ సోకిన వారికి ప్రభుత్వాసుపత్రులలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా ప్రతి బెడ్‌కు ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేశారు. మెరుగైన వైద్యం అందించి చాలా మంది ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు విస్తరిస్తున్నప్పటికీ తెలంగాణలో ఆరోగ్యశాఖ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
ఆదేశాలు లేవు
కరోనా లక్షణాలతో ఇప్పటి వరకు ఎవరు జీజీహెచ్‌కు రాలేదు. ప్రభుత్వం నుంచి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఎలాంటి ఆదేశాలు లేవు. ఆర్టీపీసీఆర్ కిట్లు కూడా పంపించలేదు. కరోనా అనుమానిత కేసులు వస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందించి కిట్లు తెప్పించి పరీక్షలు నిర్వహిస్తాం.
– డాక్టర్ వీరారెడ్డి, సూపరింటెండెంట్, జీజీహెచ్ కరీంనగర్


