ప్రతినెలా 30 పోస్టుమార్టంలు
సిమ్స్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న జీజీహెచ్ టీచింగ్ ఆస్పత్రిలో ప్రతినెలా సుమారు 30 మెడికో–లీగల్ పోస్టుమార్టంలు జరుగుతున్నాయి. సాధారణ కేసులతో పాటు క్లిష్టమైన, సవాళ్లతో కూడిన కేసులు కూడా ఇందులో ఉంటాయి. ప్రతీ కేసులోనూ శాసీ్త్రయ ఆధారాలను సేకరించడం, నిష్పక్షపాతంగా నివేదికలు రూపొందించడం అత్యంత కీలకం. ఫోరెన్సిక్ వైద్యులు నిర్వహించే పోస్టుమార్టం నివేదికలు పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారుతున్నాయి. తద్వారా న్యాయస్థానాల్లోనూ వాస్తవాలను నిర్ధారించే ప్రక్రియకు ఇవి దోహదపడుతున్నాయి.
మృతదేహాల సంరక్షణకు భరోసా
మార్చురీలో ప్రధానంగా ఎదురయ్యే సమస్యల్లో మృతదేహాల భద్రత, సంరక్షణ ఒకటి. దీనికి పరిష్కారంగా నాలుగు కోల్డ్ ఫ్రీజర్ బాక్సులు ఏర్పాటు చేశారు. దీంతో పోస్టుమార్టం పూర్తయ్యే వరకు మృతదేహాలను సురక్షితంగా, గౌరవప్రదంగా భద్రపర్చే అవకాశం ఏర్పడింది.
పోస్టుమార్టానికి కొత్త టేబుళ్లు
పోస్టుమార్టం ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా, శాసీ్త్రయంగా నిర్వహించేందుకు కొత్త డిసెక్షన్ టే బుళ్లను ఏర్పాటు చేశారు. సరైన లైటింగ్ సదుపాయాలను కల్పించారు. అవసరమైన వసతులను కూడా మెరుగుపర్చారు. దీంతో ఫోరెన్సిక్ వైద్యులు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది.
రాత్రివేళల్లోనూ సేవలు
శాంతిభద్రతలకు సంబంధించిన కేసులు, అత్యవసర పరిస్థితుల్లో పోస్టుమార్టం కోసం రాత్రివేళల్లోనూ సేవలు అందించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం జరగకుండా అవసరమైన ఏర్పా ట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. అత్యవసర కేసుల్లో సమయం కీలకం. ఆధారాలు చెదిరిపోకుండా, దర్యాప్తు ఆలస్యం కాకుండా ఫోరెన్సిక్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడం ద్వారా పోలీసు, వైద్య, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయానికి మరింత బలం చేకూరనుంది.
న్యాయ పరిరక్షణలో కీలక అడుగు
ఫోరెన్సిక్ సేవలు కేవలం పోస్టుమార్టానికి పరిమితం కావు, న్యాయ పరిరక్షణలో ఇవి కీలక భాగం అన్నదే అధికారుల ఉద్దేశం. ప్రజలు, పోలీసు, న్యాయవ్యవస్థకు సకాలంలో నాణ్యమైన మెడికో, లీగల్ సేవలు అందించడమే లక్ష్యంగా మార్చురీని ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. జీజీహెచ్ మోర్చరీలో చోటుచేసుకున్న ఈ మార్పులు ఫోరెన్సిక్ సేవలకు వేగం న్యాయ ప్రక్రియకు మరింత బలం చేకూర్చేలా నిలవనున్నాయి.
కోల్‌సిటీ: మృతదేహం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయడం.. న్యాయం వైపు దర్యాప్తును నడిపించడం.. నేరం జరిగిందా? ప్రమాదమా? అనే ప్రశ్నలకు శాసీ్త్రయ ఆధారాలతో సమాధానం చెప్పడం.. ఫోరెన్సిక్ వైద్యుల కీలక బాధ్యత. అలాంటి సేవలు అందించే గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) మార్చురీ ఇప్పుడు ఆధునిక సదుపాయాలతో కొత్త రూపు సంతరించుకుంది. ఫోరెన్సిక్ సేవలు ఆలస్యమైతే దాని ప్రభావం పోలీసుల దర్యాప్తు నుంచి న్యాయస్థానాల వరకు పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక దృష్టిసారించారు. మార్చురీలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చారు. దీంతో మెడికో, లీగల్ కేసుల్లో పోస్టుమార్టం ప్రక్రియ మరింత వేగంగా, శాసీ్త్రయంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.


