గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్‌లోని గనుల్లో కాపర్ కేబుళ్ల చోరీ ఆగడం లేదు. వరుస దొంగతనాలతో సింగరేణికి భారీగా నష్టం జరుగుతోంది. గడిచిన నాలుగు రోజుల్లో దొంగలు స్వైర విహారం చేసి అందినంత కాపర్ కేబుల్ ఎత్తుకెళ్లారు. ఈవిషయంలో యాజమాన్యం సీరియస్‌గా ఉన్నప్పటికీ దొంగలు మాత్రం తమ పనిని సులువుగా చేసుకుంటూ పోతున్నారు.
కేబుల్ యార్డులో చొరబడిన దొంగలు
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–3 పరిధిలోని ఓసీపీ 2లో కాపర్ కేబుల్ యార్డులో ఈనెల 12న దొంగలు పడి అందినంత కాపర్ కేబుల్ ఎత్తుకెళ్లారు. ప్రధాన ఎంట్రన్స్‌కు సమీపంలో ఉన్న ఎస్‌ఎంఈ సెక్షన్‌లో సీసీ కెమెరాల నిఘాలో ఉన్న ఎలక్ట్రికల్ షెడ్ లోపల ఉన్న సీసీ కెమెరాల విద్యుత్‌ను తొలగించి అందులోని సుమారు 300 మీటర్ల కాపర్ కేబుల్‌ను చోరీ చేశారు. దొంగలు లోపల ఉన్నంత సేపు ముందున్న సెక్యూరిటీ గార్డు పోస్టు వద్ద లేనట్లు అధికారులు గుర్తించారు. అయితే దొంగలు విద్యుత్ తీసేసిన సీసీ కెమెరాలు కాకుండా రహస్యంగా ఉన్న కెమెరాల్లో చోరీ వ్యవహారం మొత్తం రికార్డు అయినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఓ సెక్యూరిటీ గార్డుకు చార్జిషీట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పంద్రాగస్టురోజునే రెండు చోరీలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది పరేడ్, ఇతర బిజీలో ఉంటారని గుర్తించిన దొంగలు రెండు చోట్ల చోరీకి పాల్పడ్డారు. మధ్యాహ్నం క్వారీలోపల ఉన్న 301, 302, 303, సీడీపీ, 304 క్రషర్ల వద్ద కేబుల్ కత్తిరించుకెళ్లారు. వర్షాల మూలంగా రోడ్డు చెడిపోవడంతో వాహనాలు అటుగా వెళ్లే వీలు లేకపోవడంతో సెక్యూరిటీ గార్డును నియమించకపోవడంతో ఈచోరీ జరిగినట్లుగా చెబుతున్నారు. ఇదేరోజు రాత్రిషిఫ్టులో ఏటూ సమీపంలో చోరీ జరిగి సుమారు 20మీటర్ల ఆర్మ్‌డ్ కేబుల్‌ఎత్తుకెళ్లారు. అప్పటివరకు ఉన్న ప్రయివేట్ సెక్యూరిటీ గార్డు వెళ్లిపోగా పర్మినెంట్ సెక్యూరిటీ గార్డు విధులకు వచ్చిన క్రమంలో కాపర్ కేబుల్ చోరీకి గురైనట్లు గుర్తించారు. అధికారులు ఈవిషయాన్ని గోప్యంగా ఉంచి విచారణ జరుపుతుండగా విజిలెన్స్ అధికారులు కూడా ఈవిషయంపై లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


