విత్తనోత్పత్తి కంపెనీల దగా | - | Sakshi
Sakshi News home page

విత్తనోత్పత్తి కంపెనీల దగా

Aug 16 2026 12:33 AM | Updated on Aug 16 2026 12:33 AM

చర్యలు తీసుకోవాలి

వీణవంక: వర్షాభావ పరిస్థితులను అధిగమించి ధాన్యం పండించిన రైతులకు విత్తనోత్పత్తి కంపెనీలు చేయిచ్చాయి. ఆశించిన స్థాయి కంటే మూడొంతుల దిగుబడి వచ్చిందని రైతులు సంబరపడితే, అధిక దిగుబడి వచ్చిందని, విత్తనం అమ్ముడుపోవడం లేదని కంపెనీలు చేతులెత్తేశాయి. రైతులు పండించిన సీడ్‌ (ఆడ, మగ)ను తీసుకెళ్లిన కంపెనీలు.. 20 రోజుల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పి 80 రోజులు దాటినా చిల్లిగవ్వ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మరో పక్క వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని కంపెనీలు డబ్బు చెల్లించినా కొందరు డీలర్లు తమ ఖాతలో జమ చేసుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆడ, మగ వరి 1.20లక్షల ఎకరాలు, 22వేల ఎకరాల్లో మక్క సాగు చేశారు. వరి క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి 20వేలు ఉండగా, మక్క క్వింటాల్‌కు రూ.2 వేల నుంచి 3,300 వరకు కంపెనీలు ధరలు నిర్ణయించాయి. ఈ లెక్కన రూ.150కోట్లకు పైగా కంపెనీలు రైతులకు బకాయి పడినట్లు సమాచారం.

ఇక్కడి నేలలు అనుకూలం

రాష్ట్రంలోనే హైబ్రిడ్‌ (ఆడ, మగ) సీడ్‌ వరి, మక్క సాగులో కరీంనగర్‌ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. విత్తనోత్పత్తికి ఇక్కడి నెలలు అనువుగా ఉన్నాయి. అందుకే జిల్లాలో సాగు చేయడానికి 50కి పైగా కంపెనీలు పోటీపడుతున్నాయి. 48 ఏళ్లుగా ఇక్కడి రైతులు ఈ పంటలు సాగు చేస్తున్నారు. పంట ఉత్పత్తులను తీసుకెళ్లిన తర్వాత కొన్ని కంపెనీలు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేస్తుండగా, మరికొన్నిడీలర్ల ద్వారా ఇస్తున్నాయి. దీంతో కొందరు డీలర్లు సొంత అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంట దిగుబడి వచ్చినా రాకపోయినా ఒప్పందం ప్రకారం చెల్లిస్తామని కంపెనీల ప్రతినిధులు చెప్పడంతో రైతులు సాగు చేశారు. కానీ, వానాకాలం ప్రారంభమైనా ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదు. అంతేకాకుండా కంపెనీలు మరో మాయాజాలానికి తెరలేపాయి. క్వింటాల్‌కు 10–15కిలోల చొప్పున తరుగు పేరిట దోపిడీకి దిగుతున్నాయి.

అప్పులపాలైన ఆర్గనైజర్లు

సీడ్‌ కంపెనీలు నేరుగా రైతుకు విత్తనం ఇవ్వకుండా ఆయా గ్రామాల్లో డీలర్ల(ఆర్గనైజర్లు)ను నియమిస్తుంది. వారి ద్వారా విత్తనాలను రైతులకు అంటగడుతుంటారు. దీంతో ఏ సమస్య వచ్చినా రైతులు డీలర్లను మాత్రమే ఆశ్రయించాలి. నేరుగా కంపెనీకి వెళ్లకుండా యాజమాన్యాలు తమ మాయజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే కొందరు డీలర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జిల్లాలోని ఓ డీలర్‌ 600ఎకరాలకు పైగా మక్క విత్తనాలు ఇచ్చాడు. ఇందులో కొంత కంపెనీ ఇవ్వగా, మిగిలినది తన సొంతంగా ఇచ్చాడు. కానీ, ఈసారి మార్కెట్లో మక్కకు డిమాండ్‌ లేక సదరు డీలర్‌ చేతులెత్తేశాడు. మరికొందరు డీలర్లు గత్యంతరం లేక రూ.లక్షలో అప్పు తెచ్చి రైతులకు చెల్లించారు. దీంతో వారు రోడ్డునపడే దుస్థితి నెలకొంది. కాగా, గతంలో ఇదే డీలర్లు రైతులను నిలువుదోపిడీ చేసి రూ.లక్షల్లో సంపాదించారు. ఈ సారీ మాత్రం వారికి గడ్డు పరిస్థితి ఎదురైంది

రూ.150కోట్లకు పైగా పెండింగ్‌

హైబ్రిడ్‌ వరిని శంకరపట్నం, మానకొండూరు, వీణవంక, జమ్మికుంట, పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ముత్తారం, ఓడేడు, జగిత్యాల జిల్లాలో సాగు చేస్తున్నారు. ఎకరాకు 8క్వింటాళ్ల దిగుబడి వస్తుందని కంపెనీలు ఆశించగా, ఈసారి వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 15క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. కంపెనీలు మాత్రం టార్గెట్‌ కంటే మూడొంతులు ఎక్కువ దిగుబడి వచ్చిందని, ఎల్‌నినో ప్రభావంతో విత్తనం అమ్ముడుపోవడంలేదనే సాకుతో డబ్బులు చెల్లించడంలేదనే ఆరోపణలున్నాయి. మక్క, వరి కలిపి రూ.150కోట్లకు పైగా కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉందని ఓ డీలర్‌ చెప్పుకొచ్చాడు. హుజూరాబాద్‌ నియోజ్కవర్గంలోని ఓ డీలర్‌కు రూ.30కోట్లు రావాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు కలుగజేసుకొని సకాలంలో డబ్బులు వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వని కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి. నాకున్న రెండెకరాల్లో మక్క సాగు చేసిన .60క్వింటాళ్ల దిగుబడి రాగా రూ.1.80లక్షలు రావాల్సి ఉంది. రెండునెలలుగా డీలర్‌ను అడుగుతున్న. రేపు మాపంటూ అరిగోస పెడుతుండు. మంత్రి కలుగజేసుకొని కంపెనీల నుంచి డబ్బులు ఇప్పించాలి.

– సంపత్‌, రైతు, వీణవంక

సీడ్‌ ధాన్యం ఉత్పత్తులను తీసుకెళ్లిన కంపెనీలు

80 రోజులు గడిచినా రైతులకు అందని సొమ్ము

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరి, మక్క కలిపి రూ.150 కోట్లకు పైగా పెండింగ్‌

శ్రమకు తగిన ఫలితం రాక రైతుల కుదేలు

‘వీణవంక మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు రెండెకరాల్లో ఆడ, మగ వరి.. మరో రెండెకరాలు ఆడ, మగ మక్క వేశాడు. వరి ఎకరాన రూ.1.20 లక్షల చొప్పున, రూ.80 వేల చొప్పున మక్క మొత్తం రూ.4లక్షల దిగుబడి వచ్చింది. అదే గ్రామానికి చెందిన కంపెనీ డీలర్‌ నెల రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పి ఉత్పత్తులను తీసుకెళ్లాడు. ఇప్పటికీ 80రోజులు గడిచినా చిల్లిగవ్వ ఇవ్వలేదు. పిల్లల చదువులకు ఫీజు కట్టాలని ఎంత మొరపెట్టుకున్నా కంపెనీలు డబ్బులు ఇవ్వడం లేదని, రోజూ దాటవేస్తున్నారని సదురు రైతు వాపోయాడు. కంపెనీల మాయలో రైతులు, డీలర్లు కొట్టుమిట్టాడుతున్నారు. ఇదీ ఈ ఒక్క రైతు దుస్థితి కాదు. ఆడ, మగ పంటలు సాగు చేసిన రైతుల దీనస్థితి’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement