త్యాగధనుల స్ఫూర్తితో అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

త్యాగధనుల స్ఫూర్తితో అభివృద్ధి

Aug 16 2026 12:21 AM | Updated on Aug 16 2026 12:21 AM

● ప్రజాసంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ● ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్యెల్యే చింతకుంట విజయరమణారావు ● ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

జాతీయ జెండా ఎగురవేస్తున్న విప్‌ విజయరమణారావు, పక్కన కలెక్టర్‌ శ్రీహర్ష

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో ప్రజాసంక్షేమం, సమగ్రాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకం ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడారు.

– సాక్షి,పెద్దపల్లి

ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మందికి కొత్త పింఛన్లు అందిస్తున్నామని విప్‌ విజయరమణారావు తెలిపారు. జిల్లాలో 30,909 కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసి 88,357 మందికి ప్రయోజనం కల్పించామన్నారు. చేయూత ద్వారా 90,540 మందికి రూ.40.70 కోట్లు అందిస్తున్నా మని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా 1.19 లక్షల మందికి రూ.14.03 కోట్ల సబ్సిడీతో 4.74 లక్షల వంటగ్యాస్‌ సిలిండర్లను రూ.500కే అందించామని వివరించారు. గృహజ్యోతి పథకం ద్వారా 1,40,116 కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తూ ఇప్పటివరకు రూ.141.64 కోట్ల సబ్సిడీ ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంతో రూ.245.27 కోట్ల మేర ఆదా జరిగిందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇప్పటివరకు 5,982 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.135 కోట్లు జమ చేశామని ప్రభుత్వ విప్‌ తెలిపారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

● రైతుభరోసా ద్వారా జిల్లాలో 1,53,582 మంది రైతులకు రూ.161.38 కోట్లు, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 23వ విడతలో 65,757 రైతు కుటుంబాలకు రూ.13.15 కోట్లు జమ చేశామని విజయరమణారావు తెలిపారు. 75,257 కనెక్షన్ల ద్వారా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తూ ఏటా రూ.101 కోట్ల సబ్సిడీ ఇస్తున్నామని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు చెప్పారు. 2025–26 ఖరీఫ్‌లో రూ.845.89 కోట్ల విలువైన 3.54 లక్షల మెట్రిక్‌ టన్నులు, రబీలో రూ.1,057 కోట్ల విలువైన 4.46 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.

విద్య, వైద్య రంగాలకు భారీగా నిధులు

● అమ్మ ఆదర్శ పాఠశాలల్లో వసతుల కల్పనకు రూ.22 కోట్లు, భవిత కేంద్రాల అభివృద్ధికి రూ.66 లక్షలు, కేజీబీవీలకు రూ.1.69 కోట్లు, ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి రూ.98.60 లక్షలు ఖర్చు చేసినట్లు విప్‌ వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ద్వారా 48,188 మందికి శస్త్రచికిత్సలు చేసి రూ.120.56 కోట్ల మేర లబ్ధి చేకూర్చామని తెలిపారు. రూ.101.45 కోట్ల అంచ నా వ్యయంతో జిల్లా ఆస్పత్రిని 50 నుంచి 100 పడకలకు విస్తరించామని, మంథనిలో 50 పడకలు, గుంజపడుగులో పీహెచ్‌సీ, రామగుండంలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్‌ చెప్పారు.

వసతుల కల్పనకు పెద్దపీట

● హ్యామ్‌ తొలిదశలో 141 కి.మీ. మేర 44 రహదారి పనులు చేపడుతున్నామని విప్‌ విజయరమణారావు తెలిపారు. ప్లాన్‌గ్రాంట్ల కింద 21 రోడ్లకు రూ.574 కోట్లు, డీఎంఎఫ్‌టీ నిధులతో 19 రహదారి పనులకు రూ.187 కోట్లు కేటాయించినట్లు వివరించారు. రూ.482 కోట్లతో 10 వంతెనల నిర్మాణం, విస్తరణ చేపట్టి ఆరు పూర్తిచేశామని చెప్పారు. పెద్దపల్లి–కాల్వ శ్రీరాంపూర్‌ – కూనారం రోడ్డుపై రూ.119 కోట్లతో చేపట్టిన ఆర్‌వోబీ పనులు 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు. అమృత్‌ 2.0, యూఐడీఎఫ్‌, డీఎంఎఫ్‌టీ నిధులతో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

బస్సు డిపో, బైపాస్‌ రోడ్డు పనులకు ఊతం

● పెద్దపల్లి ప్రజల చిరకాల స్వప్నం ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణానికి రూ.8.40 కోట్లు మంజూరయ్యాయని విజయరమణారావు తెలిపారు. బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.82 కోట్లు మంజూరు చేశారని అన్నారు.

కోకాకోలా పెట్టుబడితో పారిశ్రామిక ప్రగతి

● జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి 31 యూనిట్లకు అనుమతులు ఇచ్చి రూ.17.75 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం చేశామని విప్‌ తెలిపారు. వీటిద్వారా 346 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృషితో కోకాకోలా సంస్థ రూ.700 కోట్లకుపైగా పెట్టుబడితో జిల్లాకు వస్తోందని వెల్లడించారు.

జాతీయ స్థాయి అవార్డు గ్రహీతకు సన్మానం

● స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయిలో సంగీత నాటక అవార్డు అందుకున్న దురిశెట్టి రామయ్యతోపాటు వరదల నుంచి ప్రజలను రక్షించడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన అంతం శేఖర్‌, ఆకుల అరవింద్‌ను విప్‌ విజయరమణారావు సన్మానించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ సేవా పతకాలు అందజేశారు. అలాగే వివిధ శాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన 244 మంది ఉద్యోగులను ప్రశంసించారు. అనంతరం ధర్మారం, జూలపల్లి కేజీబీవీ, ఎంజేపీ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు శ్రీరాములు, అరుణశ్రీ, డీసీపీ రాంరెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, ఆర్డీవో గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు నాణ్యమైన సన్నబియ్యం

పెద్దపల్లి: ప్రజాప్రభుత్వం ప్రతీకుటుంబానికి రేషన్‌కార్డు, నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన రేషన్‌కార్డుదారులకు స్మార్ట్‌రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 2 లక్షల 46 వేల 157 కుటుంబాలకు స్మార్ట్‌రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని విప్‌ అన్నారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న 116 జంటలకు రూ.2.50 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు పంపిణీ చేశారు. అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement