ప్రభుత్వ పాఠశాలల తనిఖీలకు ప్రత్యేక బృందాలు నేటి నుంచి జిల్లాలో రెండు బృందాల పర్యటన లోపాలు..అభ్యసన సామర్థ్యాలపై పరిశీలన సర్కారు బడుల బలోపేతం దిశగా కసరత్తు
మంథనిరూరల్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే ప్రభుత్వం, విద్యాశాఖ అనేక కార్యక్రమాలు చేస్తుండగా తాజాగా మరో అడుగు ముందుకేసింది. వసతులు, విద్యాబోధన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పాఠశాలల స్థితిగతులను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతోంది. అకాడమిక్ ప్యానెల్ బృందాలను ఏర్పాటు చేసి శిక్షణ కూడా ఇచ్చారు. శిక్షణ పొందిన బృందాలు ఈనెల 17నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి లోపాలను గుర్తించి విద్యాశాఖకు నివేదించనున్నారు. అయితే గతంలో చేసిన తనిఖీలు సత్పలితాలు ఇవ్వడంతో ఈసారి మరోసారి తనిఖీలు చేసి మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో రెండు బృందాల ఏర్పాటు
జిల్లాలో 520 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 105 జిల్లా పరిషత్, 415 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలున్నాయి. ఈ పాఠశాలలను తనిఖీ చేసేందుకు రెండు అకాడమిక్ ప్యానల్‌బృందాలను ఏర్పాటు చేశారు. మొదటి కోర్ కమిటీ బృందంలో ఒక హెచ్‌ఎంతో పాటు ఏడు సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు ఉంటారు. అలాగే రెండో బృందం సపోర్టింగ్ టీం. ఇందులో సైతం హెచ్‌ఎంతో పాటు ఏడుగురు బృందంగా నియమించారు.
తనిఖీ చేసే అంశాలు
మొదట కోర్‌కమిటీ బృందం పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, అభ్యాసన సామర్థ్యాలు, హాజరు నమోదు, మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరు, పరిశుభ్రత, తదితర అంశాలను పరిశీలిస్తారు. అనంతరం సపోర్టింగ్ టీంతో కలిసి ఆయా పాఠశాలలపై అనాలసిస్ చేసి ఒక నివేదిక తయారు చేస్తారు. ఆ నివేదికను కలెక్టర్‌కు అందజేయగా నివేదక ఆధారంగా ఆయా పాఠశాలల్లో అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
పకడ్బందీగా తనిఖీలు
పాఠశాలల తనిఖీలను పకడ్భందీగా నిర్వహిస్తాం. జిల్లాలో రెండు బృందాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చాం. ఈనెల 17 నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను బృందసభ్యులు సందర్శించి అక్కడి స్థితిగతులను పరిశీలిస్తారు. స్థితిగతులపై నివేదికలు తయారు చేసి కలెక్టర్‌కు అందజేస్తాం.
– డా.పీఎం షేక్,
ఆకాడమిక్ మానిటరింగ్ అధికారి, పెద్దపల్లి


