ఓదెల: అర్హులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆదివారం ఓదెల మండలం గుంపులలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లతో పాటు హకా ఫార్మర్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలకు రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సీ ఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. సర్పంచ్ వినుకొండ సమ్మక్క వినయ్, సింగిల్‌విండో చైర్మన్ సుమన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మట్టి గణపతులనే పూజిద్దాం
పెద్దపల్లిరూరల్: పర్యావరణాన్ని కాపాడేందుకు గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా అందరూ మట్టి గణపతులనే పూజించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి శివారు రంగంపల్లిలో ఆది వారం శివశక్తి కళాఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, నాయకులు మహేందర్, క్రాంతి, సుభాష్, సంపత్, సతీశ్, రవి, శ్రీనివాస్, రవితేజ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మంత్రుల పర్యటన
ఏర్పాట్లు పరిశీలన
రామగుండం: రామగుండంలో ఈనెల 19న పలు అభివృద్ధి పనులకు మంత్రులు బృందం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ఆదివారం మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. ఏ పవర్‌హౌస్ కూడలిలో సభాస్థలి ఏర్పాట్లు పరిశీలించి పారిశుధ్య నిర్వహణ, ఇతరాత్ర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యే, పార్టీ ముఖ్యులు హాజరుకానున్నారన్నారు. రూ.236 కోట్ల వ్యయంతో అత్యాధునిక ప్రపంచస్థాయి హంగులతో నిర్మితమయ్యే ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణం, ఇతరత్రా గ్రామీణ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రహదారులు, ఐటీఐ రహదారి నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
ప్రతీ కార్యకర్తకు
అవకాశం కల్పిస్తాం
గోదావరిఖని: పార్టీలోని ప్రతీ కార్యకర్తలకు అవకాశం కల్పించేలా సంఘటన్ సృజన్‌అభియాన్ కార్యక్రమంతో ముందుకు వచ్చామని ఏఐసీసీ అబ్జర్వర్ దీపక్ రాథోడ్, పీసీసీ సభ్యులు ఎంఏ. ఫయీం, బుద్ధారెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్ యాదవ్ తెలిపారు. ఆదివార ం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్పొరేషన్, డివిజన్ అధ్యక్షులుగా, కమిటీ సభ్యులుగా సామాన్య కార్యకర్త కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఈసందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షుని పోటీలో ఉండే అభ్యర్థుల ధరఖాస్తు ఫాంలు స్వీకరించారు. సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేశ్, కార్పొరేటర్లు, టౌన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తీర్థ యాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీ
గోదావరిఖనిటౌన్: శ్రావణ మాసం సందర్భంగా నాలుగు రాష్ట్రాల్లోని ఏడు జ్యోతిర్లింగాలు, రెండు శక్తి పీఠాల దర్శనం కోసం ఈనెల 31న ప్రత్యేక టూర్ ప్యాకేజీ బస్సు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు గోదావరిఖని ఆర్టీసీ డీఎం కవిత తెలి పారు. 31న ఖని ఆర్టీసీ డిపో నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 8న తిరిగి గోదావరిఖనికి చేరుకుంటుందన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్, ఉజ్జయిని మహాకాళేశ్వర్, గుజరాత్‌లోని నాగేశ్వర్, సోమనాథ్, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్, భీమాశంకర్, గ్రీశ్నేశ్వర్, 2 శక్తి పీఠాల పుణ్యక్షేత్ర దర్శనాలు ఉంటాయని తెలిపారు. ప్రయాణ చార్జీలు ఒక్కరికీ రూ.11,500 ఉంటుందని, భోజన, వసతి ఖర్చులు ప్రయాణీకులే భరించాల్సి ఉంటుందని వివరించారు. వివరాలకు సెల్7013504982, 7382847596 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


