టాస్క్‌‘ఫోర్స్‌’ దూకుడు | - | Sakshi
Sakshi News home page

టాస్క్‌‘ఫోర్స్‌’ దూకుడు

Aug 9 2026 2:40 AM | Updated on Aug 9 2026 2:40 AM

గోదావరిఖని: అసాంఘిక కార్యకలాపాలు, ఆహార కల్తీ, నిషేదిత క్రిమిసంహారక మందులు, అక్రమాలపై నార్కోటిక్‌, టాస్క్‌ఫోర్స్‌ దాడులు ఉధృతం చేసింది. ప్రధానంగా గంజాయి, మత్తు పదార్థాల విక్రయం, పేకాట స్థావరాలపై మెరుపు దాడులు చేస్తోంది. ఏడాది క్రితం రామగుండం కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ను ఎత్తివేశారు. అయితే, నెలరోజులుగా నార్కోటిక్‌, టాస్క్‌ఫోర్స్‌ను పునరుద్ధరించడంతో మంచిర్యాల, పెద్దపల్లిజిల్లాల్లో దూకుడు పెంచాయి. పోలీస్‌ కమిషనర్‌ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌లో ఏసీపీ, ముగ్గురు ఎస్సైలు, పదిమంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు చేసేలా ప్రణాళిక రూపొందించారు. దాడుల్లో స్వాధీనం చేసుకుంటున్న సొత్తు, ఇతర పదార్థాలు, అదుపులోకి తీసుకుంటున్న నిందితులను పోలీస్‌స్టేషన్లలో అప్పగించి కేసులు నమోదు చేసేలా చర్యల చేపడుతున్నారు.

మత్తు పర్థాలపై డేగకన్ను

గంజాయి, డ్రగ్స్‌ తదితర మత్తు పదార్థాల విక్రయాలపై నార్కోటిక్‌, టాస్క్‌ఫోర్స్‌ డేగకన్నువేశాయి. గంజాయి విక్రయాలను మూలాలతో సహా పెకిలించివేస్తున్నాయి. విక్రయదారులతోపాటు వినియోగదారులనూ వదిలిపెట్టడంలేదు. విక్రయదారులపై కేసులు నమోదు చేస్తూ, వినియోగదారులను ప్రత్యేక కేంద్రాలకు తరలించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇలా ఈఏడాదిలోనే 31 కేసులు నమోదు చేసి 5.86కిలోల రూ.2.93 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకుని 47 మందిపై కేసు నమోదు చేశారు. ఆరు వాహనాలను సీజ్‌ చేశారు.

పీడీఎస్‌ రైస్‌ స్వాధీనం

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని రెండు జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పీడీఎస్‌ రైస్‌పై కూడా దృష్టి పెట్టాయి. గత 8 నెలల్లో 117 క్వింటాళ్ల రూ.15.16 లక్షల విలువైన బియ్యం స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు నకిలీ ఆహారపదార్థాలు, నిషేధిత గడ్డిమందు విక్రయాలు, నకిలీ విత్తనాలు తదితర వాటిపై టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఈఏడాదిలో టాస్క్‌ఫోర్స్‌ దాడులు

వివరాలు కేసులు కేజీ/లీటర్‌ విలువ(రూ.లక్షలు) నిందితులు వాహనాల స్వాధీనం

గంజాయి 31 5.863 2.93 47 06

రేషన్‌బియ్యం 06 117.85 15.16 06 01

గేమింగ్‌ 05 3.09 22 08 –

ఫెస్టిసైడ్స్‌ 03 315 1.57 05 03

పచ్చళ్లు 03 600 0.90 03 –

కల్తీ, పేకాట, ఫెస్టిసైడ్‌ షాప్‌లపై ఫోకస్‌

గంజాయి, మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టి

కేసులు నమోదు చేస్తూ.. జరిమానా విధిస్తూ ముందుకు

ప్రత్యేక దృష్టి పెట్టాం

గంజాయి, డ్రగ్స్‌ తదితర మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాం. అసాంఘిక కార్యకలాపాలనూ కట్టడి చేస్తున్నాం. పేకాట, పీడీఎస్‌ రైస్‌, నకిలీ పురుగుల మందు విక్రయాలపై కేసులు నమోదు చేస్తున్నాం. ఇందులో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజలు ఏలాంటి ఇబ్బందులున్నా డయల్‌ 100 నంబర్‌ ద్వారా పోలీసులను సంప్రదించాలి.

– అంబర్‌ కిశోర్‌ ఝా, సీపీ, రామగుండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement