పెద్దపల్లిరూరల్: జిల్లాలో కోతుల దండు జనావా సాల్లో దండయాత్ర కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లు, పల్లెలు, పట్టణాలు తేడాలేకుండా సంచరిస్తున్నాయి. అటుగా వెళ్తున్న జనాలపై దాడులకు తెగబడుతున్నాయి. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పార్క్ చేసిన బైక్ కవర్లలో ఉంచిన కవర్లు, ఇతర సామగ్రి చిందరవందర చేస్తూ ఆహారపదార్థాలు లభిస్తే ఆరగిస్తున్నాయి. రైల్వేస్టేషన్‌లో కోతులబెడద మరీ తీవ్రరూపం దాల్చింది. చేతిలో లగేజీ పట్టుకుని రైల్వేస్టేషన్‌కు వెళ్లేవారిని టార్గెట్ చేసి ఏదిదొరికే దానిని పట్టుకుని పరుగెత్తుతున్నాయి. భయపడి సంచులు వదిలేస్తే తినుబండారాల కోసం వెతికి సామగ్రిని చిందరవందర చేస్తున్నాయి. వీటిబెడదతో కొందరు రైలు కూడా ఎక్కలేని పరిస్థితి దాపురిస్తోంది.
బేజారవుతున్న పల్లెటూరు ప్రజలు
జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో కోతుల బెడద సాధారణంగా లేదు. ఇంటి ఆవరణలో పెంచుకునే కూరగాయలు, పండ్ల చెట్లపైకి చేరికాయలు తిని కొమ్మలు విరిచేస్తున్నాయి. కోతుల భయంతో ఇలాంటి పంటలు వేయడం లేదని పల్లెవాసులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లితోపాటు సబ్బితం, రంగాపూర్, దేవునిపల్లి, రాఘవాపూర్, పెద్దకల్వల, పెద్దబొంకూర్ తదితర గ్రామా ల్లో కోతులతో తీవ్రంగా సతమతమవుతున్నారు. కోతులు గుంపులుగా స్వైరవిహారం చేయడమే కాకుండా అటుగా వెళ్తున్నవారిపై దాడులకు తెగబడుతూ గాయపరుస్తున్నాయి. గౌరెడ్డిపేట, రాఘవాపూర్, రంగాపూర్ ప్రాంతాల్లోని ఇటుకబట్టీల్లో పనిచేసే వలస కూలీలు సైతం కోతుల దాడిలో గాయపడి చికిత్స కోసం రాఘవాపూర్ పీహెచ్‌సీని ఆశ్రయిస్తున్నారు. కొద్దిరోజులుగా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్యసిబ్బంది చెబుతున్నారు.
అడవుల నుంచి.. జనావాసాల్లోకి
అడవుల్లో పండ్లు, ఫలాలు తింటూ హాయిగా ఉండాల్సిన కోతులు.. అక్కడ అవసరమైన తిండి దొరక్క జనావాసాల్లోకి వచ్చి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లేందుకు యత్నిస్తున్నాయి. రైలు ప్రయాణికుల సంచుల్లో ఏమైనా తిండి దొరుకుతుందేమోననే ఆశతో వాటిని చించేసి వెదుకులాడుతున్నాయి.
గుంపులుగా సంచరిస్తూ.. కనిపించిన వారిపై దాడి ప్రజల్ని భయపెడుతున్న కోతులు


