అంగన్‌వాడీ కేంద్రాల పటిష్టతకు అడుగులు సర్పంచులకు అధికారాలు తనిఖీలు.. నిరంతర పర్యవేక్షణ వారిదే ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
మంథనిరూరల్: ఐదేళ్ల వయసులోపు చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్‌వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అధికారులు పర్యవేక్షించే అంగన్‌వాడీ కేంద్రాలపై సర్పంచులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ గాడితప్పుతోందనే ఆరోపణల నేపథ్యంలో సర్పంచులకు అదనంగా అప్పగించిన పర్యవేక్షణ బాధ్యతలు ఫలితమిస్తాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 706 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలో మొత్తం 706 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 40 వేల మందికిపైగా చిన్నా రులు, 3వేల మంది గర్భిణులు, 2,900 మంది బాలింతలు ప్రయోజనం పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరికి ప్రతీరోజు కోడిగుడ్లు, పాలు, పౌష్టికాహారం అందించాలి. పౌష్టికాహారం, వివిధ సేవలు, విద్యా కార్యక్రమాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.
సర్పంచ్ చైర్మన్‌గా కమిటీలు
ప్రతీఅంగన్‌వాడీ కేంద్రంలో సర్పంచ్ చైర్మన్‌గా 11మంది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తారు. ఇందులో సర్పంచ్, అంగన్‌వాడీ టీచర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రిటైర్డ్ ఉద్యోగి, ఏఎన్‌ఎం, చిన్నారుల తల్లులతో కమిటీలు ఏర్పాటు చేస్తారు. గతంలో కూడా కమిటీలు ఉన్నా.. పర్యవేక్షణ నామమాత్రంగానే సాగేది. సర్కార్ తాజా నిర్ణయం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ గాడిలో పడే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
ప్రతీ అంశాన్ని పరిశీలించాల్సిందే
అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు సర్పంచులకు అప్పగించిన క్రమంలో వాటినిర్వహణలో ప్రతీఅంశంపై పరిశీలించాల్సి ఉంది. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ద్వారా సరఫరా చేసే గుడ్లు, పాలు, కందిపప్పు, బియ్యం, బాలామృతం పంపిణీ సక్రమంగా జరుగుతుందా? లేదా అని పరిశీలించాలి. ప్రభుత్వం అందించే నిధుల వినియోగం, ప్రతీనెల సరుకుల పంపిణీ, నాణ్యత తదితర అంశాలు తనిఖీ చేయాలి. ప్రతీనెల సమావేశం నిర్వహించి లోపాలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాలి.


