పెద్దపల్లిరూరల్: పట్టణంలోని రోడ్లపై చెత్తను పడేస్తే జరిమానా కట్టాల్సిందే. పట్టణ శివారు రంగంపల్లిలోని టైల్స్ దుకాణం నుంచి వెలువడ్డ చెత్తను రోడ్డుపై వేసినందుకు మున్సిపల్ అధికారి రమాకాంత్ బుధవారం నిర్వాహకులకు రూ. 10వేలను జరిమానా విధించారు. పట్టణాన్ని స్వచ్ఛపెద్దపల్లిగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ కోరారు. నివాసాలు, వ్యాపార స్థలాల నుంచి వెలువడే వ్యర్థాలను, పాలితిన్ కవర్లను రోడ్లపై, డ్రైనేజీల్లో పడేయొద్దని సూచించారు. పారిశుధ్య సిబ్బంది ఇంటింటికీ, దుకాణాల వద్దకు వచ్చి చెత్త సేకరిస్తారని, వారికే చెత్త అందించాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యంగా రోడ్లపై పడేసే వారిని గుర్తించి జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు.


