ప్రభుత్వ విప్‌గా విజయరమణారావు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విప్‌గా విజయరమణారావు

Mar 20 2026 10:16 AM | Updated on Mar 20 2026 10:16 AM

జెడ్పీటీసీ నుంచి విప్‌గా..

నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

జిల్లాకు మరోసారి దక్కిన ప్రభుత్వ విప్‌ పదవి

కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌

సాక్షి పెద్దపల్లి:శాసనసభ విప్‌గా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్టారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకూ, శాసనసభ వ్యవహారాలను సమన్వయం చేసేందుకు వీలుగా ప్రభుత్వం కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలను విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు విప్‌గా అవకాశం రావటంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

జిల్లాకు మరో పదవి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విప్‌గా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యవహరించగా, తాజాగా మరో సారి విజయరమణారావుకు ప్రభుత్వ విప్‌గా అవకాశం దక్కింది. పెద్దపల్లి జిల్లా నుంచి ఇప్పటికే మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మంత్రిగా వ్యవహరిస్తూ, ఐటీ పరిశ్రమల శాఖలతో పాటు శాసనసభ వ్యవహారాలు సైతం మంత్రి శ్రీధర్‌బాబు పర్యవేక్షిస్తుండగా, తాజాగా పెద్దపల్లి నుంచే ఎమ్మెల్యే విజయరమణారావు విప్‌గా నియామాకమయ్యారు. మొత్తంగా పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు అడ్లూరి లక్ష్మణ్‌, గడ్డం వివేక్‌లు ప్రాతినిథ్యం వహిస్తుండగా, తాజాగా విజయరమణారావుకు పదవి వరించింది. కాల్వశ్రీరాంపూర్‌ మండలం ఆరెపల్లి గ్రామంతో అనుబంధం ఉన్న ఎమ్మెల్యే బల్మూరి వెంకట్‌ సైతం శాసనమండలి విప్‌గా నియామకయ్యారు.

సీఎం సన్నిహితుడుకి దక్కిన గౌరవం

సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయరమణారా వులు ఇరువురు టీడీపీ పార్టీలో నుంచి సన్నిహితులు. వీరిద్దరు ఒకేసారి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఎమ్మెల్యే విజయరమణారావుకు విప్‌ పదవి దక్కనున్నట్లు ప్రచారం జరిగిన నియామకం జరగలేదు. తాజాగా ముగ్గురు విప్‌లను నియమించగా, అందులో సీఎం రేవంత్‌రెడ్డి తన సన్నిహితుడు విజయరమణారావుకు అవకాశం కల్పించారు.

సభా నిర్వహణలో విప్‌లదే కీలక పాత్ర

శాసనసభలో ఏదైనా బిల్లుపై ఓటింగ్‌ జరిగినప్పుడు లేదా ముఖ్యమైన చర్చలు జరిగినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యేలా చూడటంలో విప్‌ల పాత్ర అత్యంత కీలకం. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరూ ఓటు వేయకుండా పార్టీ లైన్‌ను అమలు చేయటం వారి ప్రధాన బాధ్యత.

కాంగ్రెస్‌లో జోష్‌

పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ వ్యవహరిస్తుండగా, 58 కార్యవర్గంతో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలను గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ప్రకటించారు. 6గురు డీసీసీ ఉపాధ్యక్షులు, 12మంది ప్రధాన కార్యదర్శులు, ఒక్క ట్రెజరీ, నలుగురు అధికార ప్రతినిధులు, 16సెక్రటరీలు, 19మంది కార్యవర్గ సభ్యులతో జంబో కమిటీలను నియామించటంతో ఎన్నో రోజులుగా పార్టీ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశం దక్కటంతో వారిలో ఆనందం వ్యక్తమవుతుంది. డీసీసీ కమిటీతో పాటు జిల్లాకు మరో పదవి వరించటంతో జిల్లా కాంగ్రెస్‌లో జోష్‌ పెరిగింది.

1983లో టీడీపీ పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన విజయమరమణరావు, 1993–95 వరకు జూలపల్లి మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1995 నుంచి 2000వరకు జూలపల్లి జెడ్పీటీసీగా, 2001–23లో ఉమ్మడి కరీంనగర్‌ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా, 2003–05వరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా టీడీపీ పార్టీ సెక్రటరీగా, 2005–07వరకు ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా, 2007–09వరకు వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు. 2010–17 వరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసి. 2017 అక్టోబర్‌లో రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2023లో రెండోసారి పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement