● హుజూరాబాద్ నియోజకవర్గం రైతుల చిరకాలవాంఛ అయిన కల్వల ప్రాజెక్టు రూ.70 కోట్ల ప్రతిపాదనలతో నిర్మాణానికి ఇటీవల డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ బడ్జెట్‌లో ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి ప్రకటన ఉంటుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాసనసభలో నేడు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లావాసులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రధాన ప్రాజెక్టులకు ఈసారైనా మోక్షం లభించేనా..? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ – కరీంనగర్‌ను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వేలైన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాజన్న ఆలయ పునరుద్ధరణ, మాస్టర్‌ప్లాన్ కోసం వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీడీఏ)కి నిధులు, పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక పత్తిపాక రిజర్వాయర్‌పై ప్రకటన, కల్వల ప్రాజెక్టు నిర్మాణాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
● వేములవాడ ఆలయ పునరుద్ధరణ, మాస్టర్ ప్లాన్ అమలు కోసం వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఇప్పటి వరకు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేసింది. మాస్టర్‌ప్లాన్ సమగ్ర అమలు, ఆలయ నిర్మాణం పూర్తవాలంటే.. మరో రూ.200 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా.
● జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట దక్క న్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్ర భుత్వం నుంచి ప్రకటన కోసం స్థానిక రైతులు ఎదురుచూస్తున్నారు. 2015లో మూ తబడిన ఈ పరిశ్రమను తిరిగి తెరిపిస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ రూ.172 కోట్ల బ కాయిలు చెల్లించింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం దాదాపు రూ.250 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేసింది. 2025లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. నేటి బడ్జెట్‌లో ఆ మేరకు నిధులు కేటాయిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
● మనోహరాబాద్ నుంచి కొ త్తపల్లి వరకు రూ.2,780 కోట్లతో రైల్వేప్రాజెక్టు లైన్ పనులు నడుస్తున్నాయి. సిరిసిల్ల వరకు లైన్ పూర్తవగా.. సిద్ధిపేట – సికింద్రాబాద్ వరకు రైలు అందుబాటులోకి వచ్చింది. మిడ్‌మానేరులో బ్రిడ్జి పనులు ఇటీవల మొదలయ్యాయి. ఇక వేములవాడ, వెదిర, కొత్తపల్లి వరకు పనులు సాగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, భూసేకరణ వంటి సమస్యలతో పనులు జాప్యమవుతున్నాయి. ఈ రైల్వేలైన్ పూర్తయితే.. ఉత్తర తెలంగాణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఉమ్మడి జిల్లాకు రాజధానితో కనెక్టివిటీ పెరగడంతోపాటు కొమురవెల్లి, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరుగుతుంది.
● రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి 2018లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తాత్సారంతో దాని నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈఎస్‌ఐ ఆస్పత్రి పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాల్లో పనిచేసే సుమారు 60వేల మంది కార్మికులకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం రూ.150 కోట్లు నిధులు కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో భూ కేటాయింపులు, తదితర పనుల జాప్యంతో ముందుకు సాగడం లేదు.
● పెద్దపల్లితోపాటు కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు భూములను స్థిరీకరించేందుకు ప్రతిపాదించిన శ్రీలక్ష్మీనరసింహ పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి నిధుల విడుదలపై ఉమ్మడి జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం రూ.1.10 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మూడు నుంచి ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పత్తిపాక రిజర్వాయర్ పూర్తయితే పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని, కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గాల్లోని 2.40 లక్షల ఎకరాలతోపాటు కొత్తగా 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చు.
● రామగుండం బీ థర్మల్ పవర్ ప్లాంట్ మూసివేత అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల మంత్రివర్గంలో మంత్రుల బృందం ఎన్టీపీసీ, జెన్‌కో సంస్థల్లో ఏది తక్కువ వ్యయంతో ప్లాంట్ నిర్మించి, తక్కువ రేట్‌కు కరెంట్ ఇచ్చే సంస్థకు నిర్మించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని, నిధులు కేటాయిస్తేనే ఈ ప్రాంతవాసుల కోరికై నా ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ప్రస్తుతం పాత బీ థర్మల్ ప్లాంట్ మిషనరినీ తుక్కు కింద విక్రయించేందుకు వివిధ విభాగాల అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు.


