పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబమే కాదు సమాజంలో కూడా మార్పు కనిపిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. మహిళల కోసం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని, కానీ, మహిళలు ఏ పనిచేయకుండా ఉంటే ఆ రోజే గడవదన్నారు. సమాజంలో వస్తున్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మహిళలు సైతం పోటీపడుతున్నారని అన్నారు. మహిళల కోసం అనేక చట్టాలు అమల్లో ఉన్నాయన్నారు. న్యాయసేవలను ఉచితంగా పొందేందుకు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, వేణుగోపాల్, రవీందర్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.


