125 మందికి డబ్బుల్లేవ్ చేతులెత్తేసిన రామగుండం బల్దియా శానిటేషన్ కార్మికులకు చెల్లించి.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వదిలేసి.. పండుగపూట తప్పని పస్తులు
కోల్‌సిటీ(రామగుండం): ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ఆనందం వెల్లివిరియాల్సిన ఆ కుటుంబాల్లో ఆందోళన, ఆవేదన, నిరాశే మిగిలింది. రామగుండం కార్పొరేషన్‌లో పనిచేసే సుమారు 125 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందక వారి కుటుంబాలు పండుగపూట పస్తులు ఉండాల్సిన దుస్థితి తలెత్తింది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వీరికి మూడోవారం గడుస్తున్నా జీతాలు అందలేదు. ‘ఆర్థిక సంక్షోభం’, మూడోవారం గడుస్తున్నా కార్మికులకు అందని వేతనాలు శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించినా.. అందరికీ న్యాయం జరగలేదు.
శానిటేషన్ సిబ్బందికే ఊరట
‘సాక్షి’ కథనంతో తక్షణ చర్యలు చేపట్టిన అధికారులు.. శానిటేషన్‌లోని 448 మంది అవుట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలను బ్యాంక్ ఖాతాల్లో జమచేశారు. ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 125 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు. వీరికి జీతాలు చెల్లించడానికి సుమారు రూ.21 లక్షలు అవసరమని, ప్రస్తుతం ఆ మేరకు నిధులు లేవని అధికారులు చేతులెత్తేశారు.
పండగపూట కష్టాలు
శానిటేషన్ సిబ్బందికి జీతాలు జమకావడంతో.. తమకూ వస్తాయని ఆశతో ఎదురుచూసిన ఆఫీస్ సిబ్బందికి నిరాశే మిగిలింది. ఉగాది, రంజాన్ పండగల వేళ కుటుంబ ఖర్చులు పెరిగి, చేతిలో డబ్బు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
అండగా నిలవని సంఘాలు
వేతన సమస్యపై అధికారులను ప్రశ్నించేందుకు కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు ముందుకు రాకపోవడం ఉద్యోగుల్లో మరింత ఆవేదన కలిగిస్తోంది. సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.
సమాధానం లేని అధికారులు
వేతనాల చెల్లింపుల్లో ఆలస్యంపై అధికారులను ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియక ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. వేతనాల కోసం ఎదురుచూస్తున్న కార్మికులు, పండగపూట పస్తులుండాల్సి వచ్చింది. దీంతో బల్దియా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితం అనిశ్చితిలో కూరుకుపోయింది.


