గుమ్మలక్ష్మీపురం: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన రాష్ట్ర రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరిచి పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పార్వతీపురం మన్యం జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కరరావు, పత్తిక చంద్రమోహన్ తెలిపారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా జిల్లా నుంచి పాల్గొన్న 50 మంది క్రీడాకారుల్లో 18 మంది గోల్డ్ మెడల్స్‌ను, 20 మంది సిల్వర్ మెడల్స్‌ను, 12 మంది కాంస్యం మెడల్స్‌ను పొందారని తెలిపారు.
పైడితల్లి జాతరలో 21 పనులకు టెండర్ల ఆహ్వానం
విజయనగరం క్రైమ్ : ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీ పైడితల్లి జాతరకు సంబంధించిన ఏర్పాట్లు పనులకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు దేవదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష శనివారం తెలిపారు. సిరిమాను సంబరం, తొలేళ్ల పండగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఏర్పాటు పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. చదురగుడి, వనంగుడులలో ఎలక్ట్రికల్ పనులు, చలువ పందిళ్లు వేయటానికి, క్యూ లైన్లు, వనంగుడిలో ఆర్చి, లడ్డూ ప్రసాదం తయారీ వంటి 21 పనులు చేయించేందుకు ఈ నెల 16వ తేదీలోపు టెండర్లను దేవదాయ శాఖ కోరుతోందని ఈఓ శిరీష తెలిపారు. వివిధ రకాల పనులు, వాటి వ్యయాల బట్టి, వంద నుంచీ యాభై వేల రూపాయల వరకు దేవస్థానం పేరుతో డీడీ తీసి టెండర్‌కు జతపరచి బాక్స్‌లో వేయాలని తెలిపారు.
కార్మికుడి మృతి
కొత్తవలస : మండలంలోని కంటకాపల్లి గ్రామ సమీపంలో గల శారడ మెటల్స్ అండ్ ఎల్లోయిస్ కర్మాగారంలో అస్వస్థతతో కాంట్రాక్టు కార్మికుడు చింత గౌరినాయుడు (45) శనివారం మృతి చెందాడు. దీనికి సంబంధించి సీఐ టి.వి.విజయకుమార్ తెలిపిన వివరాలు.. వేపాడ మండలం బొద్దాం గ్రామానికి చెందిన మృతుడు చింత గౌరినాయుడు శారడ కర్మాగారంలో చిన్నారావు అనే లేబర్ కాంట్రాక్టర్ వద్ద గత కొద్ది కాలంగా రాయి కొట్టే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటి మాదిరిగానే శనివారం పనికి వచ్చి మధ్యాహ్నం భోజనం అనంతరం ఒంట్లో నలతగా వుందని తోటి కార్మికులకు చెప్పి చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలోనే వాంతులు చేసుకోవడంతో తోటి కార్మికులు గమనించి వెంటనే కొత్తవలసలో గల ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం పెందుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మృతుడు భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
బాలింత..
సీతంపేట: మండలంలోని శిలిగాం గ్రామానికి చెందిన ఐదు నెలల బాలింత కె.రేణుక (36) శనివారం శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. జ్వరం, విరేచనాలతో బాధ పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే బీపీ పూర్తి స్థాయిలో పడిపోవడంతో ప్రాధమిక చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేసినట్టు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. రేణుక అంగన్‌వాడీ హెల్పర్‌గా పని చేస్తుంది. ఐదు నెలల కిందట కుమార్తెకు జన్మనిచ్చింది. ఈమె మృతితో భర్త కిషోర్ గుండెలవిసేలా రోదిస్తున్నారు.
గుర్తు తెలియని మహిళ మృతి
మెరకముడిదాం : మండలంలోని బిళ్లలవలస గ్రామంలో శనివారం రామాలయం వద్ద గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మృతి చెందిన మహిళ బిళ్లలవలస గ్రామంలో గత రెండు రోజులుగా గ్రామంలో తిరుగుతూ వుండేదని, హిందీలో మాట్లాడేదని, ఎవరు తినేందుకు ఏమి పెట్టినా తినేది కాదని గ్రామస్తులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున రామాలయం వద్ద విగత జీవిగా పడి వుందని తెలిపారు. విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేయడంతో బుదరాయవలస ఎస్‌ఐ తన సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలు ఎక్కడ నుంచి వచ్చింది.. ఏ ప్రాంతానికి చెందినది అన్న వివరాలు తెలియరాలేదు. దీంతో గ్రామస్తులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేశారు.


