● వంతెనకు ఇరువైపులా గోడల నిర్మాణం
● శిథిలమైన వంతెనను పరిశీలించిన
ఆర్‌అండ్‌బీ, పోలీస్ అధికారులు
తెర్లాం:
రాజాం – రామభద్రపురం ఆర్‌అండ్‌బీ రోడ్డులో మండలంలోని పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వాహనాల రాకపోకలను శనివారం ఉదయం నుంచి ఆర్‌అండ్‌బీ, పోలీస్ అధికారులు పూర్తిగా నిషేధించారు. పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వంతెనను మండల ఆర్‌అండ్‌బీ ఏఈ రాజు తన సిబ్బందితో పరిశీలించి వంతెన ప్రమాదకరంగా ఉందని, ఎప్పుడైనా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో వంతెన పైనుంచి రాకపోకలు సాగించే వాహనాలు వెళ్లకుండా పూర్తిగా బంద్ చేశారు. వంతెన పైనుంచి వాహనాలు రాకుండా ఉండేలా వంతెనకు ఇరువైపులా రోడ్డు మధ్యలో సిమెంట్ ఇటుకలతో గోడలు కట్టారు. వంతెన మీదుగా వాహనాలు, ప్రయాణికులు వెళ్లే ప్రమాదం ఉందని గుర్తించిన పోలీస్ అధికారులు వంతెనకు రెండు వైపులా స్టాఫర్లు, ఇసుకతో నింపిన డ్రమ్ములు ఏర్పాటు చేశారు.


