‘బాల సంజీవని’ టెండర్లలో అవకతవకలు | - | Sakshi
Sakshi News home page

‘బాల సంజీవని’ టెండర్లలో అవకతవకలు

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

‘బాల సంజీవని’ టెండర్లలో అవకతవకలు

బాల సంజీవని టెండర్లలో గోల్‌మాల్‌పై స్వతంత్ర విచారణ జరపాలి

విజయనగరం గంటస్తంభం: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే బాల సంజీవని పథకాన్ని కొద్ది మంది బడా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు పరిమితం చేయడం సరికాదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్మి బుగత అశోక్‌ విమర్శించారు. బాల సంజీవని, బాల సంజీవని ట్రైబల్‌ టెండర్లలో జరిగినట్టు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం సీపీఐ నాయకులతో కలిసి కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ, అదనపు జిల్లా మెజిస్ట్రేట్‌ సీహెచ్‌ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 26 జిల్లాలను నాలుగు యూనిట్లుగా విభజించి నిర్వహించిన టెండర్ల మొత్తం వార్షిక విలువ సుమారు రూ.172.80 కోట్లు కాగా, కిట్‌ ధరలు పెరిగాయని తెలిపారు. ట్రైబల్‌ కిట్‌ఽ ధర రూ.350 నుంచి రూ.446కు, సాధారణ కిట్‌ ధర రూ.241 నుంచి రూ.283.19కు పెరగడం వల్ల సుమారు రూ.29.22 కోట్ల మేర అదనపు ప్రజాధనం భారం పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యయానికి సంబంధించిన పూర్తి లెక్కలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని కోరారు. టెండర్‌ నిబంధనల్లో సొంత తయారీ యూనిట్‌, ఫుడ్‌ సేప్టీ లైసెన్స్‌, ఉత్పత్తి సామర్థ్యం వంటి అర్హతలు ఉన్నప్పటికీ, తయారీ యూనిట్లు లేని సంస్థలకు కాంట్రాక్టులు ఎలా దక్కాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గతంలో అనర్హతకు గురైన సంస్థలకు తిరిగి ఎలా అర్హత కల్పించారో విచారించాలన్నారు. పలువురు బిడ్డర్లు ఒకే ధరను కోట్‌ చేయడం వంటి అంశాలపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. జోన్‌ విధానాన్ని రద్దు చేసి జిల్లా వారీగా టెండర్లు నిర్వహించాలని, డ్వాక్రా సంఘాలు, మహిళా స్వయం సహాయక గ్రూపులకు పథకాన్ని అప్పగించాలని అశోక్‌ డిమాండ్‌ చేశారు. టెండర్లపై ఆర్థిక ఆడిట్‌ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ జిల్లా సమితి సభ్యులు పొందురూ అప్పలరాజు, బూర వాసు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement