గరుగుబిల్లి: ఎగువన ఉన్న ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు, జిల్లాలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తోటపల్లి సాగునీటి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటిమట్టం 105 మీటర్లకుగాను 104.25 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.058 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బ్యారేజీకి సగటున 8,497 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, ఈ మేరకు మూడు గేట్లును ఎత్తి సగటున 7,691 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి ప్రధాన కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, పాత కుడి కాలువ ద్వారా 40 క్యూసెక్కులు, పాత ఎడమ కాలువ ద్వారా 414 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులు బి.కిషోర్‌కుమార్, శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టుకు అధికంగా వరద వస్తే దిగువకు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు.
ఐపీహెచ్‌ఎల్ ప్రారంభం
సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రి నూతన భవనంలో ఐపీహెచ్‌ఎల్ (ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబరోటరీ)ని వర్చువల్ మోడ్‌లో కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ, ఆర్‌ఎంఓ డీవీ శ్రీనివాస్, సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


