పెదపెంకిలో డ్రెయిన్లతో మ్యాజిక్‌! | - | Sakshi
Sakshi News home page

పెదపెంకిలో డ్రెయిన్లతో మ్యాజిక్‌!

Sep 13 2026 12:48 AM | Updated on Sep 13 2026 12:48 AM

కాలువల నిర్మాణంలో విన్యాసాలు

అప్పుడు వేసి.. ఇప్పుడు తొలగించి...

వృథా అవుతున్న రూ.కోట్లాది నిధులు

సాక్షి, పార్వతీపురం మన్యం/బలిజిపేట: బలిజిపేట మండలం పెదపెంకిలో మ్యాజిక్‌ డ్రైన్ల పేరిట అధికారులు విన్యాసాలు చేస్తున్నారు. అవగాహన ఉండి చేస్తున్నారా.. లేక, ఉప ముఖ్యమంత్రి దత్తత గ్రామం కావడం వల్ల తెలియకపోయినా బుర్ర ఊపేశారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు నిర్మించిన డ్రైన్లను ఇప్పుడు తొలగిస్తున్నారు. దీనివల్ల రూ.కోట్లాది నిధులు మట్టి పాలవుతున్నాయి. పెదపెంకి గ్రామాన్ని దాదాపు మూడు దశాబ్దాలుగా బోధ వ్యాధి పీడిస్తున్న విషయం విదితమే. అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ పరిస్థితిని అధిగమించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ భావించారు. ఎక్కడికక్కడ మురుగు నీరు నిల్వ ఉండిపోవడం వల్ల దోమల వ్యాప్తి చెందుతోందని భావించి.. ఇక్కడ మ్యాజిక్‌ డ్రైన్లు, సిమెంట్‌ రోడ్లు, పలు అభివృద్ధి పనుల కోసం రూ.6.5 కోట్లు మంజూరు చేయించారు. వర్షం నీరు, వాడుక నీరు అక్కడే భూమిలోకి ఇంకిపోయేలా మ్యాజిక్‌ డ్రైన్లు నిర్మించాల్సి ఉంది.

రాజకీయాలతో పనులకు గ్రహణం

రూ.కోట్లలో నిధులు వస్తుండటంతో రాజకీయ నేతల కన్ను పనులపై పడింది. అప్పటి వరకు పనులు చేసిన కాంట్రాక్టర్‌ను తొలగించి, తమవారికి అప్పగించాలని అధికార పార్టీకి చెందిన నేత పట్టుబట్టారు. ఆయన సూచించిన కాంట్రాక్టరు చేసిన పనుల్లో నాణ్యతాలోపం స్పష్టంగా కనిపించింది. ఈ పనుల నిర్వహణపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండుసార్లు ఆయన ప్రారంభోత్సవానికి పెదపెంకి రావాల్సి ఉన్నా.. పనులు పూర్తి కాకపోవడంతో పర్యటన వాయిదా పడింది. మరోవైపు అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పనులకు కొంతమంది స్థానికుల నుంచి కూడా సహకారం కరువైంది. అడుగడుగునా అడ్డుపడుతున్నారు. దీనికి తోడు మొదట్లో అధికారులు ప్రధాన రహదారి పక్కన వేసిన మ్యాజిక్‌ డ్రైన్‌న్‌ అడ్డుసుడి పనులు ఫలితంగా ప్రజలకు అవస్థలు అధికమయ్యాయి.

అడ్డదిడ్డం పనులు.. ఆగ్రహించిన ప్రజలు

గ్రామంలో గాంధీ విగ్రహం నుంచి బస్టాండు వరకు ఉండే ప్రధాన రహదారికి ఒకవైపు వేసిన మ్యాజిక్‌ డ్రైన్‌న్‌ పనిని అధికారులు ఇష్టారాజ్యంగా వేయడంతో సమస్య తలెత్తింది. కాలువలలో మురుగునీరు నిల్వ ఉండిపోవడం, నివాస గృహాల్లోకి నీరు చేరిపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఈ నేపథ్యంలో శుక్రవారం అధికారులు గ్రామంలోకి వచ్చినప్పుడు గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక అధికారులు ప్రధాన రహదారికి పక్కగా వేసిన మ్యాజిక్‌ డ్రైన్‌న్‌లో ఉన్న పిక్కను తొలగించి మురుగునీరు బయటకు వచ్చేలా చేశారు. తొలగించిన మ్యాజిక్‌ డ్రైన్‌ను తిరిగి వేస్తారా? వేస్తే పాత పిక్కనే వినియోగిస్తారా? కొత్త పిక్కను వేసి ఇప్పటికై నా మ్యాజిక్‌ డ్రైన్‌న్‌ నిర్మాణం పక్కాగా చేపడతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలలు గడిచిపోతున్నా పెదపెంకిలో అభివృద్ధి పనులకు ఒక రూపు రావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement