● నర్సింగ్ విద్యార్థుల సేవలే దిక్కు
● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
విజయనగరం ఫోర్ట్: జూనియర్ వైద్యుల సమ్మెతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి. నర్సింగ్ విద్యార్థుల సేవలతోనే రోగులు సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జూనియర్ వైద్యుల సమస్య పరిష్కారానికి చంద్రబాబు సర్కారు పట్టించకోవడం లేదు. స్టైఫండ్ పెంచేవరకు విధుల్లో చేరేది లేదని జూనియర్ వైద్యుల తేల్చిచెబుతున్నారు. ఇరువర్గాలు దిగిరాకపోవడం రోగులకు శాపంగా మారింది. వాస్తవంగా ఆస్పత్రిలో ఎక్కవ సేపు జూనియర్ వైద్యులే సేవలు అందిస్తారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రోగులకు సూచించిన చికిత్సను అమలు పరిచేది జూనియర్ వైద్యులే. రోగులకు రక్తం, ప్లేట్ లెట్స్ ఎక్కించడం, ఇంజిక్షన్లు చేయడం, ముఖ్యంగా రోగులకు డ్రెస్సింగ్ చేయడం తదితర అన్ని సేవలు వీరు అందిస్తారు. ప్రస్తుతం వీరు తమ సమస్యల పరిష్కారం కోసం ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీనివల్ల జూనియర్ వైద్యులు అందించాల్సిన సేవలను నర్సింగ్ విద్యార్థులతో అందిస్తున్నారని, ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్న రోగుల నుంచి వినిపిస్తోంది.


