● అనేక వాహనాలు తిరుగుతున్నా
పట్టించుకోని అధికారులు
విజయనగరం ఫోర్ట్: అధికారిక పత్రాలు లేని (రిజిస్ట్రేషన్, ఎఫ్‌సీ కాలపరిమితి అయిపోయిన) వాహనాలు రోడ్డుపై తిరుగుతున్నా రవాణాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాది వాహనాలు జిల్లాలో ఉన్నప్పటికీ అధికారులు వాటిని కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ద్విచక్రవాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు, లారీలు, బస్సులు ఇలా ప్రతి వాహనానికి రోడ్డుపై నడపడానికి 15 ఏళ్ల పాటు కాలపరిమితి ఉంటుంది. అయితే రవాణా వాహనాలకు రిజిస్ట్రేషన్ కాలపరిమితి 15 ఏళ్లు ఉన్నప్పటికీ రెండేళ్లకు ఒకసారి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (వాహనం సామర్థ్యం నిర్ధారించే) తీసుకోవాలి. ఆటోలు, బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, టిప్పర్లు ఇలా మనుషులను, మూగజీవాలను రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా రెండేళ్లకు ఒకసారి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. వాహనం సామర్థ్యం లేకుండా నడపడం వల్ల ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఉంది. జిల్లాలో రిజిస్ట్రేషన్, ఎఫ్‌సీ వంటి పత్రాల కాలపరిమితి దాటిపోయిన వాహనాలు 3 వేల నుంచి 5 వేల వరకు ఉన్నాయి. ఎటువంటి పత్రాలు లేని వాహనాలు రోడ్డుపై తిరిగినప్పుడు ప్రమాదానికి గురైతై ప్రమాదంలో ఎవరైనా మృతి చెందినా, తీవ్రంగా గాయపడిన వారికి ఎటువంటి ప్రమాద బీమా వర్తించదు.
10 మంది ఇన్‌స్పెక్టర్లకు అదనపు బాధ్యతలు
రవాణాశాఖ కార్యాలయంలో 10 మంది వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. జిల్లాలో 27 మండలాలున్నాయి. వాటిని 10 మందికి కొన్ని కొన్ని మండలాలు చొప్పున అప్పగించారు. వారి మండలాల పరిధిలో పత్రాలు లేకుండా రోడ్డెక్కే వాహనాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం వారి విధి. అయితే వాహనతనిఖీలు పూర్తి స్థాయిలో రవాణా అధికారులు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే పత్రాలు లేకపోయినా యథేచ్ఛగా వాహనాలను రోడ్డుపై వాహనదారులు తిప్పుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాహనాలు సీజ్ చేస్తాం
10 మంది వెహికల్ ఇన్‌స్పెక్టర్లకు కొన్ని మండలాలు చొప్పున కేటాయించాం. వారి పరిధిలోని మండలాల్లో వాహన తనిఖీలు చేపట్టాలి. ఎటువంటి పత్రాలు లేకుండా రోడ్డెక్కిన వాహనాలపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తాం.
మణికుమార్, డిప్యూటీ ట్రాన్సపోర్ట్ కమిషనర్


