రామభద్రపురం: తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన చాలామంది బాలికలు చదువు ఆపేసే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి నిరుపేద బాలికలు చదువును ప్రోత్సహించడమే లక్ష్యంగా వీకే ఫౌండేషన్, క్రెడిట్ బి సంయుక్తంగా పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని వీకే ట్రస్టు ప్రతినిధి కొల్లి ఈశ్వరరావు తెలిపారు. ఈ మేరకు రామభద్రపురంలోని భవిత కేంద్రం ఆవరణలో తల్లిదండ్రులను కోల్పోయిన సుమారు 30 మంది నిరుపేద విద్యార్థినులకు స్కాలర్‌షిప్ మంజూరు పత్రాలు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీకే ఫ్యామిలీ ఫౌండేషన్, క్రెడిట్ బి సంయుక్తంగా తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ బాలికలకు ఒక్కొక్కరికి నెలకు రూ.1000 చొప్పున 8వ తరగతి నుంచి డిగ్రీ పూర్తయ్యే వరకు ష్కాలర్‌షిప్ అందజేస్తాయని చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురం మన్యం జిల్లాల్లో సుమారు 200 పైబడి అనాథ నిరుపేద బాలికలకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామన్నారు. మూడు జిల్లాలో సుమారు 1000 మంది బాలికలకు వారు వారి గ్రామాల నుంచి పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో 1000 సైకిళ్లు అందజేశామని చెప్పారు. ఈ ఏడాది మూడు జిల్లాల్లో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాల్లా టాప్ టెన్‌లో నిలిచిన 36 మంది విద్యార్థులకు రూ.2.40 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు అందజేశామన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు, ఎంఆర్‌సీ సిబ్బంది బొప్పే సురేష్, శ్రీనివాసరావు, రాజేశ్వరి, ప్రసాద్,శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
వీకే ఫౌండేషన్ ప్రతినిధి కొల్లి ఈశ్వరరావు


