గుర్ల: మండలంలోని కోటగండ్రేడుకు చెందిన యువకుడు ఓనం దేవకీనందన్ (21) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దేవకీనందన్ అదే గ్రామానికి చెందిన డిగ్రీ చదువుతున్న యువతిని ప్రేమించాడు. ప్రేమ పెళ్లికి సంబంధించి పది రోజులుగా స్థానిక పోలీస్‌స్టేషన్, గ్రామ పెద్దల వద్ద పంచాయితీ జరగ్గా ఇరువర్గాల కుటుంబసభ్యులు పెళ్లి అంగీకరించారు. పెళ్లి ముహుర్తాలు పెట్టడానికి గ్రామపెద్దలు యువతి, యువకుడి కుటుంబసభ్యులును ఆదివారం పిలవగా ఘర్షణ తలెత్తింది. అక్కడ జరిగిన పరిస్థితులపై మనోవేదనకు గురైన దేవకీనందన్ కోటగండ్రేడు శివారు ప్రాంతంలో గల తమ సొంత స్థలంలో నిర్మిస్తున్న కళ్లంలో సోమవారం తెల్లవారు జామున ఉరి వేసుకున్నాడు. దేవకీనందన్ ఇటీవల జరిగిన ఆర్మీ నియామకాల్లో అగ్నివీర్‌కు ఎంపికయ్యాడు. అగ్నివీర్‌లో చేరకుండానే ఆత్మహత్య చేసుకోవడంపై తల్లిదండ్రులు దాలినాయుడు, లక్ష్మి ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతికి గ్రామపెద్దలే కారణమని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గుర్ల ఎస్సై పి.నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


