రాజన్నదొర దిగ్భ్రాంతి
● పాఠశాల ప్రహరీ కూలి పదోతరగతి విద్యార్థి మృతి
● మూత్ర విసర్జనకు వెళ్లి విగతజీవిగా మారిన వైనం
● సరిపడా మరుగుదొడ్లు ఉంటే బిడ్డ మృతిచెందేవాడు కాదంటూ కన్నీరుపెట్టిన తల్లిదండ్రులు
● సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్
సాలూరు రూరల్: చక్కగా చదువుకుంటున్నాడు... ప్రయోజకుడిగా మారితే ఆదుకుంటాడని ఆశపడ్డాం... పాఠశాలలో మరుగుదొడ్లు లేక.. మూత్రవిసర్జనకు ఆరుబయటకు వెళ్లిన కుమారుడిని ప్రహరీ రూపంలో మృత్యువు కాటేసింది... ప్రభుత్వ నిర్లక్ష్యమే మా బిడ్డను చంపేసిందంటూ సాలూరు పట్టణం పెద్దవీధికి చెందిన తుపాకుల అరుణ్‌తేజ్ (15) తల్లిదండ్రులు సుమన్, అశ్విని కన్నీరు పెట్టారు. విద్యార్థి మృతితో సాలూరు ఉన్నత పాఠశాల నిశ్శబ్దంగా మారింది. ప్రతి ఒక్కరిలో విషాదం అలముకుంది. అందరితో కలిసి సోమవారం మధ్యాహ్నభోజనం చేసిన పదో తరగతి విద్యార్థి అరుణ్‌తేజ్... తోటి విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రహరీ వెనుకకు మూత్రవిసర్జనకు వెళ్లాడు. అంతే... ప్రహరీ పూర్తిగా నాని ఉండడంతో ఒక్కసారిగా కూలిపోయింది. ప్రహరీకి దగ్గరగా ఉన్న అరుణ్‌తేజ్‌పై పూర్తిగా పడిపోవడంతో దుర్మరణం చెందాడు. పక్కనే ఉన్న మరో విద్యార్థి సుమన్ అశ్విన్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రాణం ఉందన్న అనుమానంతో ఉపాధ్యాయులు పక్కనే ఉన్న సాలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రి మార్చురీలో ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.
తల్లిదండ్రులు రాకముందే మార్చురీకి....
విద్యార్థి తల్లితండ్రులు వచ్చేసరికి మృతదేహాన్ని మార్చురీ గదిలోకి తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థి మృతదేహంతో పాఠశాల ఆవరణకు చేరుకుని ఆందోళనకు దిగారు. సాలూరు బోసుబొమ్మ కూడలిలో కాసేపు ఆందోళన చేశారు. విద్యార్థి మృతిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12 గంటలకు విద్యార్థి ప్రమాదానికి గురైత 1.30 వరకు సమాచారం ఇవ్వలేదని, తోటి విద్యార్థి సమాచారం ఇవ్యడంతో వచ్చామని తల్లి అశ్విని ఆవేదన వ్యక్తం చేసింది. పాఠశాలలో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడం వల్లే నా బిడ్డ ఈ రోజు చనిపోయాడంటూ బోరున విలపించింది. మరుగుదొడ్లు ఉంటే నా బిడ్డ ప్రమాదం బారిన పడే అవకాశం ఉండేది కాదని, బతికి ఉండేవాడంటూ కన్నీరు పెట్టింది.
డీఈఓను నిలదీసిన సాలూరు వాసులు
పాఠశాల ప్రహరీ కూలి విద్యార్థి మృతి చెందాడన్న సమచారం మేరకు డీఈఓ పి.బ్రహ్మాజీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయనను విద్యార్థి కుటుంబ సభ్యులు, స్థానికులు నిలదీశారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతిచెందాడని, ప్రాణం తేగలరా అంటూ ప్రశ్నించారు. సగం కూలి ఉన్న ప్రహరీ వద్దకు పిల్లలు మూత్ర విసర్జనకు ప్రతిరోజూ వెళ్తున్న ఉపాధ్యాయులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఉపాధ్యాయులు గమనించకపోవడమే ప్రమాదానికి కారణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి మృతిచెందాడని, మృతుని కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్యాలని సీపీఐ నాయకురాలు రాధ, సీపీఎం నాయకుడు ఎన్‌వై నాయుడు, సాలూరు పట్టణ ప్రజలు డిమాండ్‌చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షల పరిహారం ఇస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ప్రకటించడం సరికాదన్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ
విద్యార్థి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆర్డీఓ మాధురి పాఠశాల వద్దకు చేరుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. న్యాయం చేస్తామని చెప్పారు.
సాలూరు: సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీకూలి రెల్లివీధికి చెందిన తుపాకుల అరుణ్‌తేజ (15) మృతిపై వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పాఠశాల ప్రహరీ కూలి చదువుకుంటున్న చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకునేలా ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లలను పాఠశాలలకు పంపిస్తే క్షేమంగా తిరిగివస్తారనే తల్లిదండ్రుల నమ్మకాన్ని ప్రభుత్వం కాపాడాలన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, ప్రహరీలు, పైకప్పులు, తదితర నిర్మాణాలపై సమగ్ర భద్రతా తనిఖీలు నిర్వహించి, ఇటువంటి మరణాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.


