పార్వతీపురం: జాతీయ నాణ్యతా ప్రమాణాల అంచనా (ఎన్‌క్యూఏఎస్)లో పార్వతీపురం జిల్లా ఆస్పత్రి అత్యుత్తమ స్కోరు సాధించడంపై కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి ఎన్‌క్యూఏఎస్‌తోపాటు లక్ష్య, ముస్కాన్ గుర్తింపు లభించడం గర్వకారణమన్నారు. ఆస్పత్రిలోని 16 విభాగాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఈ గుర్తింపు లభించిందని తెలిపారు. పారిశుధ్యం, మౌలికవసతులు, నాణ్యమైన వైద్య సేవలందించడంలో కృషి చేసిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. సాధారణ ప్రసవాల్లో జిల్లా ఆస్పత్రి ముందంజలో ఉండడం, హెచ్‌ఐవీ బాధిత గర్భిణులకు సైతం సురక్షిత ప్రసవాలు నిర్వహిస్తున్న వైద్యబృందం సేవలను ప్రశంసించారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లలోనూ ఎన్‌క్యూఎస్ ప్రమాణాలు సాధించేలా ‘ముస్తాబు’ కార్యక్రమంద్వారా సుందరీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఆర్.వైశాలి, డీసీహెచ్‌ఎస్ డా.జి.నాగభూషణరావు, సూపరింటెండెంట్ వి.నాగశివజ్యోతి, డీఎంహెచ్‌ఓ డా.విజయలక్ష్మి తదితరులున్నారు.
పర్యావరణ హిత ఇటుకల తయారీకి శ్రీకారం
పార్వతీపురం: పర్యావరణ హిత ఇటుకల తయారీ ప్రక్రియ ప్రారంభం ఎంతో శుభపరిణామం అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు పార్వతీపురం మండలంలోని వెంకంపేట గ్రామంలో ఎంఈజీపీ పథకంలో భాగంగా ‘జేకేఎస్ గ్రీన్‌వాల్ సొల్యూషన్స్’ పేరుతో ఇంటర్ లాకింగ్ ఇటుకల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన గంటేటి రోజారాణిని ఆయన సోమవారం అభినందించారు. మహిళా వ్యవస్థాపకులు తయారీ రంగంలో రాణించడం పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు సంతోషకరమన్నారు. ఉత్పత్తుల తయారీతోపాటు వాటికి సరైన మార్కెటింగ్ అనుసంధానం కల్పించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. అధికారులు మహిళా వ్యవస్థాపకులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు.
చేతికొచ్చిన పంట ధ్వంసం
జియ్యమ్మవలస రూరల్: చేతికొచ్చిన పంటను నాశనం చేయడంతో పాటు పొలాల్లో వేసిన డ్రిప్ పైపులను ఏనుగులు ధ్వంసం చేశాయని మండలంలోని కన్నపుదొర వలస గ్రామానికి చెందిన అల్లు అప్పలనాయుడు, దాసరి సురేష్ మరి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొలాల్లో వేసిన వరి, మొక్క జొన్న, కూరగాయలు పంటలను సోమవారం ధ్వంసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేల రూపాయలు మదుపులు పెట్టి పండించిన పంటలను క్షణాల్లో పాడుచేసి రైతులకు ఉసూరుమనిపిస్తున్నాయని వాపోయారు. తక్షణమే సంబంధిత అధికారులు తమకు న్యాయం చేయాలని వారు కోరారు. సోమవారం సాయంత్రానికి ఏనుగుల గుంపు నిమ్మలపాడు గ్రామ సమీపంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.


