● కలెక్టరేట్‌లో అర్జీదారుల అగచాట్లు
పార్వతీపురం రూరల్: తమ గుండెకోతను అధికా రులకు విన్నవించుకుందామని జిల్లా నలుమూలల నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన అర్జీదారులకు..పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం అవస్థల స్వాగతం ఎదురైంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఉదయం 9గంటల నుంచే విచ్చేసిన అర్జీదారులకు ప్రాంగణంలో కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆ వేదిక కాస్తా అవస్థల చిత్రానికి అద్దం పట్టింది. సమస్యల పరిష్కారం కోసం కోటి ఆశలతో వచ్చిన సామాన్యులు.. వసతుల లేమితో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఎదురుచూసే క్రమంలో కుర్చీల జాడ లేకపోవడంతో జనం పడిన పాట్లు వర్ణనాతీతం. నిలబడలేక, నిస్సహాయులైన కొందరు నేలమీదనే కింద కూర్చుండిపోగా.. మరి కొందరు చెట్ల నీడలో ఆసరా పొందారు. ఇంకొందరు ప్రాంగణంలోని గోడ గట్లనే కుర్చీలుగా మలుచుకుని సేదదీరగా, వృద్ధులు, మహిళలు సైతం కిటికీల సందుల వద్దే నిలబడి నిరీక్షించారు.


