ఇదెక్కడి చోద్యం సర్‌ | - | Sakshi
Sakshi News home page

ఇదెక్కడి చోద్యం సర్‌

Aug 17 2026 1:05 AM | Updated on Aug 17 2026 1:05 AM

ఇదెక్కడి చోద్యం సర్‌

సాలూరు: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా సాలూరు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఓటర్లకు నోటీసులు జారీ కావడంతో ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలోని సాలూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడ మండలాల్లో 2024 ఎన్నికల సమయంలో మొత్తం 2,04,874మంది ఓటర్లు ఉండగా,1,58,355 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అనంతరం 49,588 మంది ఓటర్లకు సంబంధించి నోటీసులు జనరేట్‌ అయ్యాయి.

అయోమయంలో ఓటర్లు

నియోజకవర్గంలోని సాలూరులో 25,784, పాచిపెంట మండలంలో 8664, మెంటాడ మండలంలో 5734, మక్కువ మండలంలో 9376 మంది ఓటర్లు మొత్తం 49558 మందికి నోటీసులు జనరేట్‌ అయ్యాయి. నోటీసులు అందుకుంటున్న ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. భారీ సంఖ్యలో నోటీసులు జారీ కావడంతో మా ఓటు ఉంటుందా?జాబితా నుంచి తొలగిస్తారా అనే సందేహం ఓటర్లలో నెలకొంది.నోటీసు అందించిన వెంటనే బీఎల్‌ఓలు ఫొటోలు తీసియాప్‌లో అప్‌లోడ్‌ చేస్తుండడంతో తమపై ఏదైనా చర్య ప్రారంభమైందనే భయాందోళన వ్యక్తమవుతోంది. తమ ఓటు ఉంటుందో ఊడుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికంగా గిరిజన గ్రామాల్లోనే నోటీసులు జారి అయ్యాయని, సాలూరు మండలంలోని గిరిశిఖర కొదమ గ్రామంలో 2300 ఓట్లకు గాను సుమారు 1100 మందికి నోటీసులు జారీ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

నోటీసులు అందిస్తున్నాం

నోటీసులు జనరేట్‌ అయిన ఓటర్లకు నోటీసులు అందిస్తున్నాం. నోటీసులు ఇచ్చి వారం రోజులైన ప్రాంతాల్లో హియరింగ్‌ మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నాం. వచ్చే నెల 21 వరకు హియరింగ్‌ జరుగుతుంది. నియమనిబంధనల మేరకు పారదర్శకంగా ప్రతి దశను చేపడుతున్నాం. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు అందరం కృషి చేస్తున్నాం.

–సురేష్‌, సాలూరు తహసీల్దార్‌

నోటీసుల జారీతో గ్రామాల్లో గగ్గోలు

సాలూరు నియోజకవర్గంలో 49,588 మందికి నోటీసులు

తమ ఓటు ఉంటుందో ఊడుతుందోనని ఆందోళనలో ప్రజలు

అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదే..

నోటీసు రావడానికి గల కారణం ఏమిటి? ఏ పత్రాలు సమర్పించాలి? ఎక్కడ సమర్పించాలి? ఎంత సమయంలోగా సమర్పించాలి? హియరింగ్‌లో ధ్రువీకరణ ప్రక్రియ ఎలా జరుగుతుంది? తదితర అంశాలను బీఎల్‌ఓలు స్పష్టంగా ప్రతి దశను వివరించి అవగాహన పెంపొందించాలని ఓటర్లు కోరుతున్నారు. నోటీసు అందుకున్న ఓటరు ధ్రువీకరణ చేసుకోవడంలో విఫలమైతే కచ్చితంగా ఓటు తొలగిపోతుందని స్పష్టంగా తెలియచేయడం, నోటీసులో కోరిన పత్రాలను సమర్పించి రసీదు తీసుకోవడం మంచిదని తదితర అంశాలపై ఈ ప్రక్రియను అధికారులు ఓటర్లుకు వివరించాల్సి ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో అధికారులు మరింత ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.

నోటీసులు అందిస్తున్న బీఎల్‌ఓలు

నోటీసులు జనరేట్‌ అయిన ఓటర్ల ఇళ్లకు బూత్‌ లెవెల్‌ అధికారులు(బీఎల్‌ఓలు) వెళ్లి నోటీసులను అందిస్తున్నారు. ఎస్‌ఐఆర్‌ నమోదులో ఏ పొరపాటు వల్ల నోటీసు జనరేట్‌ అయ్యిందో వివరిస్తున్నారు. దానికి పరిష్కారం తెలుపుతూ, ఓటరు తన అర్హతను ధ్రువీకరించుకునేందుకు. నిబంధనల ప్రకారం ఏవైనా నాలుగు అర్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని, గ్రామసభల హియరింగ్‌ ప్రక్రియ గురించి వివరిస్తున్నారు. ఇదే క్రమంలో నోటీసులు అందిస్తున్నప్పుడు బీఎల్‌ఓలు ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీంతో ఇది డిజిటల్‌గా నమోదవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement